: అమెరికాతో ఒప్పందం వద్దంటూ వినూత్న నిరసన... 900 మంది దక్షిణ కొరియా వాసులు గుండ్లు గీయించుకున్న వైనం!

అమెరికాతో త‌మ‌ దేశం థాడ్ (యూఎస్ టెర్మినల్ హైట్ ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్) ఒప్పందం చేసుకున్న అంశంపై దక్షిణ కొరియా పౌరులు నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సియాంజులో ఓ భారీ యాంటీ మిసైల్ యూనిట్ ఏర్పాటు కానుంది. అయితే, త‌మ దేశ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ భద్రతకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని వారు ఆందోళ‌న చేస్తున్నారు. నిర‌స‌న‌లో భాగంగా దాదాపు 900 మంది బహిరంగంగా గుండ్లు చేయించుకున్నారు. అమెరికాతో అణు కార్యక్రమంలో భాగంగా త‌మ దేశం అనుచిత నిర్ణయం తీసుకుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సియాంజు నగర ప్రజలు తమ దేశ స్వేచ్ఛా దినం రోజే ఆందోళ‌న‌కు దిగ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ద‌క్షిణకొరియా, అమెరికా దేశాల‌పై ఉత్త‌ర‌కొరియా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోన్న సంగ‌తి విదితమే. ఉత్తరకొరియా ప‌లుసార్లు అణు పరీక్షలు నిర్వహించి ప్ర‌త్య‌ర్థి దేశాల‌ను నాశ‌నం చేస్తామంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తోంది. ఈ క్ర‌మంలో దక్షిణ కొరియా అమెరికాతో ఇటువంటి ఒప్పందం చేసుకుంది. సియాంజులో భారీ యాంటీ మిసైల్ యూనిట్ ఏర్పాటు కానున్న భూభాగం వ్యవసాయానికి అనువైంది. ఈ భూభాగంలో రైతులు ఎన్నో ర‌కాల పంట‌లు పండిస్తున్నారు. అమెరికా ఇప్పుడు అక్కడ యాంటీ మిసైల్ యూనిట్ ఏర్పాటుచేస్తే వ్య‌వ‌సాయం చేసుకునే వీరి భూమి అంతా దెబ్బతినే అవ‌కాశం ఉంది. దీంతో త‌మ దేశం చేసుకున్న ఒప్పందానికి వ్య‌తిరేకంగా వారు నినాదాలు చేస్తూ త‌మ నిర‌స‌న‌లు తెలుపుతున్నారు.

More Telugu News