: భారత తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్... లాంచింగ్ కు రెడీ!

ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ బైక్ 'టీ6ఎక్స్' ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. టార్క్ మోటార్ సైకిల్ సంస్థ దీన్ని తయారు చేయగా, ఒకసారి చార్జింగ్ తో 100 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుందని, 125 సీసీ బైక్ తో సమానంగా పరుగులు పెట్టగలదని తెలుస్తోంది. ఇండియాలో ఇప్పటివరకూ బ్యాటరీతో పనిచేసే స్కూటర్లు మార్కెట్లోకి వచ్చాయే తప్ప, పూర్తి స్థాయి బైక్ మాత్రం రాలేదు. డిసెంబర్ లోగా మార్కెట్లోకి బైక్ లను విడుదల చేయనున్న టార్క్, రెండు వేరియంట్లను పరిచయం చేయనుంది. గరిష్ఠంగా 95 కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణిస్తాయని, ఈ బైకుల టైర్ల కోసం సియట్ తో డీల్ కుదుర్చుకున్నామని, అత్యాధునిక ఆన్ బోర్డ్ నావిగేషన్, క్లౌడ్ కనెక్టివిటీ, ఫుల్ డిజిటల్ డిస్ ప్లే, క్విక్ చార్జింగ్ తదితర సదుపాయాలున్నాయని సంస్థ ప్రతినిధి ఒకరు వివరించారు. ఈ బైకుల కోసం ప్రతి నగరంలో 100 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. తొలి దశలో పూణె, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో విక్రయాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. బైక్ ఆవిష్కరణ తరువాత, ఏడాది వ్యవధిలో 10 వేల యూనిట్లను విక్రయించాలని భావిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News