: కాసుల వర్షం కురిపించిన 'డ్యాన్సింగ్ క్వీన్' మరణిస్తే, కనీస నివాళులకూ కదలని చిత్ర సీమ!

జ్యోతిలక్ష్మి... ఆ పేరు వింటేనే నాటి కుర్రకారు ఉర్రూతలూగి పోయేవారు. ఆమె పాట ఉందని తెలిస్తే, సినిమాకు మినిమమ్ గ్యారెంటీ. పాట లేకుంటే 100 రోజులు ఆడే సినిమా 50 రోజులకూ పరిమితం. 'ఇందులో జ్యోతిలక్ష్మి పాట ఉందా?' అని అడిగి, 'లేకపోతే పెట్టండి' అంటూ డిస్ట్రిబ్యూటర్లు సైతం డిమాండ్ చేసేవారు. 1970, 80వ దశకంలో 'డ్యాన్సింగ్ స్టార్'గా తెలుగు చిత్రసీమను ఏలిన జ్యోతిలక్ష్మి ఒకనాటి వైభవమిది! ఎన్టీఆర్ నటించిన 'సర్దార్ పాపారాయుడు' సినిమాకు సైతం కలెక్షన్లు తగ్గాయని భావించిన వేళ, దాసరి నారాయణరావు స్వయంగా జ్యోతిలక్ష్మితో పాట తీసి, 50 రోజుల తరువాత చిత్రానికి జోడిస్తే, ఆ పాట కోసమే జనాలు వెర్రెక్కిపోయి మళ్లీ మళ్లీ సినిమాను చూశారు. అంతటి చరిత్ర ఉన్న జ్యోతి లక్ష్మి మరణిస్తే, మీడియా ముందు సానుభూతి చెప్పడం మినహా, ఆమెకు నివాళులు అర్పించేందుకు, కడసారి చూసేందుకు తెలుగు చిత్ర సీమ నుంచి ఎవరూ వెళ్లలేదన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ వందలాది చిత్రాల్లో నటించిన ఆమెను చివరిసారి చూసేందుకు కనీసం పది మంది తెలుగు సినీ ప్రముఖులు కూడా చెన్నై వెళ్లలేదంటే, మన హీరోలు, నిర్మాతలు, దర్శకుల్లో మానవత్వం ఏ మేరకు ఉందో ఇట్టే తెలిసిపోతుంది. తమిళనాడు ప్రభుత్వం అధికారిక నివాళులు అర్పించిన వేళ, ఇక్కడి నుంచి ఇద్దరు ముగ్గురు మాత్రమే వెళ్లారు. అది కూడా మొక్కుబడిగా వెళ్లి చూసి వచ్చేశారు. పరిశ్రమలో మంచీచెడులు ఏవి జరిగినా, ముందుండే ప్రముఖ దర్శకులు, ఆమెతో పాటలు తీసి సొమ్ము చేసుకున్న నిర్మాతలు ఏ మాత్రం స్పందించకపోవడాన్ని సగటు సినీ ప్రేక్షకులు విమర్శిస్తున్నారు.

More Telugu News