: కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేల ఓట్లతో గద్దెనెక్కిన కలిఖోపుల్!...‘సుప్రీం’ తీర్పుతో పదవీచ్యుతి!

ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనే ఉరేసుకున్న స్థితిలో విగత జీవిగా కనిపించిన అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కలిఖోపుల్ మరణంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ సీనియర్ రాజకీయవేత్త... సొంత పార్టీలో చీలిక తెచ్చి కొందరు ఎమ్మెల్యేలను రెబెల్స్ గా మార్చారు. అప్పటిదాకా సీఎంగా ఉన్న ఖప్రిసో కాంగ్ ను గద్దె దించారు. ఆ తర్వాత అదే రెబెల్ ఎమ్మెల్యేల సహాయంలో ఆయన సీఎం పీఠమెక్కారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఏకంగా ఆరు నెలల పాటు (ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకు) ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలన సాగించారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరతపై ఘాటుగా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కలిఖో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో దిగిరాక తప్పని కలిఖో... తాను సీఎం పీఠం నుంచి దించేసిన ఖప్రిసో కాంగ్ ను కాకుండా నబం తుకీని గద్దెనెక్కించారు. నబం తుకీ గత నెలలోనే కలిఖోపుల్ నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే సీఎం అధికారిక నివాసాన్ని కలిఖోపుల్ ఇంకా ఖాళీ చేయలేదు. రేపో, మాపో సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉన్న తరుణంలో సదరు భవంతిలోనే కలిఖోపుల్ ఉరేసుకున్న స్థితిలో విగత జీవిగా కనిపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 47 ఏళ్ల వయసులోనే కలిఖోపుల్ హఠాన్మరణం పాలైన విషయం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేేపేలానే ఉంది.

More Telugu News