: బులంద్‌షహర్ గ్యాంగ్ రేప్.. నిందితులను 24 గంటల్లో పట్టుకోవాలంటూ పోలీసులకు సీఎం అల్టిమేటం

దేశాన్ని మరోమారు షాక్‌కు గురిచేసిన బులంద్‌షహర్ గ్యాంగ్‌రేప్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందించారు. నిందితులను 24 గంటల్లో పట్టుకోవాలంటూ పోలీసులను ఆదేశించారు. ‘‘నిందితులను 24 గంటల్లో పట్టుకోవాలంటూ బులంద్‌షహర్ ఎస్ఎస్పీకి ఆదేశాలు జారీచేశాం’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ‘‘నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తాం. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో డీజీపీకి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది’’ అని సీఎం అఖిలేష్ పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై బులందర్‌షహర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో)ను సస్పెండ్ చేశారు. నిందితుల కోసం రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ బృందాలు ప్రధాన నిందితుడిని గుర్తించినట్టు డీజీపీ జావీద్ తెలిపారు. అలాగే ముగ్గురు అనుమానితులు నరేశ్(25), బబ్లూ(22), రాయస్(28)లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. నిందితులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేస్తామని హోంకార్యదర్శి తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలో బులందర్‌షర్‌లో జరిగిన సామూహిక అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. శుక్రవారం రాత్రి కారులో వెళ్తున్న ఓ కుటుంబాన్ని ఢిల్లీ-కాన్పూర్ జాతీయ రహదారిపై దోస్త్‌పూర్ సమీపంలో అడ్డగించిన దుండగులు వారిని దోచుకున్నారు. అనంతరం పురుషుల కాళ్లు, చేతులు కట్టేసి మహిళ, ఆమె 13 ఏళ్ల కుమార్తెపై ఐదుగురు దుండగులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. ఈ ఘటనతో అఖిలేష్ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

More Telugu News