: చట్టంలో వున్న వాటిని నెరవేరుస్తాం.. చట్టంలో లేని వాటి గురించి నేనేమీ మాట్లాడలేను!: వెంకయ్యనాయుడు

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మనసులో ఉందన్న సంగతిని తాను కూడా అంగీకస్తానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అయితే అది చట్టంలో లేనప్పుడు తాము మాత్రం ఏం చేయగలమని ఆయన ప్రశ్నించారు. ప్రాథమికంగా కాంగ్రెస్ తప్పులు చేస్తే... వాటిని తాము సరిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. అయితే మనసులో ఉన్న కోరికలు చట్టాలు కాదన్న సంగతి కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ కు చాలా చేయాలని తమకు ఉందని ఆయన తెలిపారు. అయితే తాము కేంద్ర ప్రభుత్వంలో భాగమని అన్నారు. దేశంలో ప్రతి రాష్ట్రము ఎలాగో ఏపీ కూడా అలాగేనని ఆయన చెప్పారు. అయినప్పటికీ ఏపీ భవిష్యత్ తరాలను గుర్తుంచుకుని అక్కడి ప్రజలు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రెవెన్యూ సమస్యలు ఉన్నాయన్న సంగతి తమకు తెలుసని, అయితే తమకు కూడా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిని పరిష్కరించుకుని వెళ్తున్నామని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదాపై చర్యలకు అటార్నీ జనరల్ ను అధ్యయనం చేయాలని ఆదేశించామని, ఆ నివేదిక వచ్చిన తరువాత ప్రత్యేకహోదాపై చర్చలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఓటమి పాలయ్యారు కాబట్టి కాంగ్రెస్ నేతలు ఏపీని వెనకేసుకుని వస్తున్నారని, అదే విజయం సాధించి ఉంటే ఎలా మాట్లాడి ఉండేవారో గుర్తించాలని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏఏ హామీలు చట్టంలో చేశారో వాటన్నింటినీ నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. చట్టంలో లేని వాటి గురించి తానేమీ మాట్లాడలేనని ఆయన తెలిపారు. ఇప్పుడు అన్ని పార్టీలు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వమని అంటున్నాయని, తమకు కూడా ఇవ్వాలని కోరుతున్నాయని, ఇలాంటి ఎక్సక్యూజ్ లు తాను అంగీకరించనని, తాము ప్రజలకు ఏం ఇస్తామని చెప్పామో...వాటిని నెరవేరుస్తామని ఆయన తెలిపారు.

More Telugu News