: మెస్సీకి జైలుశిక్షతో ఇబ్బందుల్లో టాటా మోటార్స్!

ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను సక్రమంగా చెల్లించని అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ లియెనెల్ మెస్సీకి కోర్టు 21 నెలల జైలుశిక్ష, 2 మిలియన్ యూరోల జరిమానా విధించడంతో, ఆయనకు భారీ మొత్తం చెల్లించి రెండేళ్ల కాంట్రాక్టును కుదుర్చుకున్న టాటా మోటార్స్ ఇబ్బందుల్లో పడింది. స్పెయిన్ లో భారీ విస్తరణ ప్రణాళికలను రూపొందించిన టాటా మోటార్స్, మెస్సీని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్న సంగతి తెలిసిందే. మెస్సీతో కలసి రూపొందించిన వ్యాపార ప్రకటనలు, టెలివిజన్ యాడ్స్ ఇప్పటికే ప్రసారం అవుతున్నాయి. ఇప్పుడిక మెస్సీ జైలుకు వెళితే పరిస్థితి ఏంటన్నది టాటా మోటార్స్ ను తొలచివేస్తోంది. ఇదే విషయమై సంస్థ ప్రతినిధిని వివరణ కోరగా, "ఇప్పటికిప్పుడు ఏమీ స్పందించలేము. మరిన్ని వివరాల కోసం వేచి చూస్తున్నాం" అన్న సమాధానం వచ్చింది. ఇటీవల పెనాల్టీ కిక్ ను గోల్ గా మలవడంలో విఫలమైన మెస్సీ, అర్జెంటీనా జట్టు నుంచి వైదొలగినట్టు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో అతని పాప్యులారిటీ ఎంతమాత్రమూ తగ్గబోదని వ్యాఖ్యానించిన టాటా మోటార్స్, అతనితో తమ బంధం కొనసాగుతుందని ప్రకటించింది. తాజా పరిణామాలతో టాటా మోటార్స్ పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. మెస్సీని గత సంవత్సరం నవంబరులో బ్రాండ్ అంబాసిడర్ గా టాటా మోటార్స్ నియమించుకున్న సంగతి తెలిసిందే. అతని కాంట్రాక్టు నవంబర్ 2017 వరకూ కొనసాగాల్సి వుంది. ఒకవేళ మెస్సీ జైలుకు వెళితే, ఈ కాంట్రాక్టు రద్దుకే టాటా మోటార్స్ యత్నించవచ్చని సమాచారం. ఇప్పటికే సెడాన్ కైట్ 5, హెక్సా, నెక్సాన్ తదితర వేరియంట్ల ప్రమోషన్ కోసం మెస్సీతో టీవీ కమర్షియల్స్ ను సంస్థ తయారు చేయించుకున్న సంగతి తెలిసిందే. కాగా, మెస్సీతో కాంట్రాక్టుకు టాటా మోటార్స్ రూ. 12 నుంచి రూ. 15 కోట్ల వరకూ వెచ్చించినట్టు పరిశ్రమ వర్గాల సమాచారం.

More Telugu News