: యజమాని హత్య కేసులో పెంపుడు చిలుక పలుకులు సాక్ష్యానికి నిలుస్తాయా?

అమెరికాలోని మిచిగన్ లో జరిగిన ఒక హత్య కేసులో పెంపుడు చిలుక సాక్షిగా మారనుంది. ఈ వింత సంఘటన గురించిన వివరాలు... మిచిగన్ లోని సాండ్ లేక్ పట్టణంలో గత ఏడాది మేలో గ్లెన్న డురమ్ అనే మహిళ తన భర్త మార్టిన్ ను హత్య చేసిందనే ఆరోపణలతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. వారి నివాసంలోనే జరిగిన ఈ సంఘటనలో మార్టిన్ కు ఐదు బుల్లెట్లు దిగినట్లు పోలీసులు గుర్తించారు. భర్త మృతదేహం పక్కనే పడి ఉన్న గ్లెన్న డురమ్ తలకు కూడా బుల్లెట్ తగిలి గాయమైంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వారి పెంపుడు చిలుక పలికిన పలుకులు పోలీసులను ఆలోచనలో పడేశాయి. ఈ సంఘటనకు సంబంధించి ఆ దంపతుల మధ్య చోటు చేసుకున్న గొడవ గురించి చిలుక పలుకులు పలుకుతోంది. ‘ఇంట్లోంచి వెళ్లిపో’, ‘ఎక్కడికి వెళ్లాలి’, ‘నన్ను కాల్చొద్దు’ అనే పదాలను పొడిపొడిగా పలుకుతుండటాన్ని విచారణాధికారులు గమనించారు. అయితే, గ్లెన్న డురమ్ తాను భర్తను చంపలేదని చెబుతోందని సదరు అధికారులు తెలిపారు. కాగా, చిలుక పలుకులు సాక్ష్యానికి చెల్లుతాయా? లేదా? అనే విషయమై ఆలోచిస్తున్నట్లు న్యూఎగో కౌంటీ ప్రాసిక్యూటర్ రాబర్ట్ పేర్కొన్నారు.

More Telugu News