: జుకర్ బర్గ్ ఆధిపత్యానికి గండికొట్టే యత్నాల్లో ఫేస్ బుక్!

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ లో యాజమాన్య హక్కులు మారిపోనున్నాయి. ఇప్పటివరకూ మార్క్ జుకర్ బర్గ్ అత్యధిక ఓటింగ్ హక్కులను కలిగివుండగా, భవిష్యత్ అవసరాల దృష్ట్యా, ఆయన ఆధిపత్యాన్ని తగ్గించాలని సంస్థ బోర్డు డైరెక్టర్లు నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో వాటాదారుల అభిప్రాయాన్ని కోరనున్నట్టు యూఎస్ సెక్ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్)కు ఫేస్ బుక్ బోర్డు ఓ ప్రకటన వెలువరించింది. ఆయన వద్ద ఉన్న క్లాస్ బీ వాటాలను క్లాస్ ఏ వాటాలుగా మార్చాలని కూడా ప్రతిపాదించనున్నట్టు తెలిపింది. కాగా, జూన్ 2 నాటికి సంస్థ వ్యవస్థాపకుడి హోదాలో ఉన్న జుకర్ బర్గ్ వద్ద 40 లక్షల క్లాస్ ఏ, 41.9 కోట్ల క్లాస్ బీ వాటాలున్నాయి. మొత్తం మీద ఆయన వద్ద 53.8 శాతం ఓటింగ్ హక్కులున్నాయి. దీన్ని 50 శాతం కన్నా కిందకు తీసుకురావాలన్నది బోర్డు అభిమతం కాగా, ఈ నెల 20న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం వెలువడవచ్చని సమాచారం. ఓ వ్యవస్థాపకుడి హోదాలో ఆయన్ను కొనసాగించరాదని, ఒకవేళ ఏదైనా జరిగితే ఆయన లేనప్పటికీ, సంస్థ సక్రమంగా నడిచేలా ఏర్పాట్లు చేయడమే తమ ఉద్దేశమని ఈ సందర్భంగా బోర్డు ప్రకటించింది.

More Telugu News