: అమెరికా, కెనడాల్లోని తెలుగు వారికి ఏపీలో పెట్టుబడుల గురించి వివరిస్తున్న ఏపీఎన్ఆర్టీ సొసైటీ

అమెరికా, కెనడాల్లో నివాసం ఉంటున్న తెలుగువారికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వ్యాపార, సేవా అవకాశాలపై అవగాహన కల్పించేందుకు గాను ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు (ఏపీఎన్ఆర్టీ) సొసైటీ సీఈవో వేమూరు రవికుమార్ 25 రోజుల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా అమెరికా, కెనడాల్లో తెలుగు వారు నివాసముండే 21 నగరాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ లో వ్యాపార, సేవా అవకాశాలపై ఎన్ఆర్ఐ తెలుగు వారికి అవగాహన కల్పించనున్నట్టు ఆయన చెప్పారు. మే 26న ప్రారంభమైన ఈ పర్యటనలో ఇప్పటి వరకు టెక్సాస్ లోని ఒడెస్సా, హ్యూస్టన్, డలాస్, జార్జియా స్టేట్ లోని అట్లాంటా నగరాల్లో నివాసం ఉంటున్న తెలుగువారిని కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో చమురు, నూనెశుద్ధి, సహజవాయువు, వ్యవసాయ, వైద్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని, అమరావతిలో ఎన్ఆర్టీ నిర్మించతలపెట్టిన సాంకేతిక ఆకాశహర్మ్యంలో (ఎన్ఆర్టీ ఐకాన్) తమకు కూడా భాగం కావాలని 120 మంది ఎన్ఆర్ఐలు పేర్లు నమోదు చేయించుకున్నారని ఆయన తెలిపారు. అలాగే సొంత రాష్ట్రానికి సేవ చేయడంలో భాగంగా, పలు గ్రామాల్లో నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు పలువురు ఎన్ఆర్ఐలు ముందుకువచ్చారని, అక్కడికక్కడే విరాళాలు ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా అంతా సీఎం చంద్రబాబునాయుడి దార్శనికతను కొనియాడుతున్నారని ఆయన తెలిపారు.

More Telugu News