: సచిన్ కుమారుడి ఎంపికపై సోషల్ మీడియాలో దుమారం

టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ను అండర్ 19 జట్టుకు ఎంపిక చేయడం వివాదంగా మారింది. అర్జున్ ఎంపికను ఎవరూ ప్రత్యేకంగా తప్పుపట్టనప్పటికీ, మహారాష్ట్ర స్కూల్ క్రికెట్ లో వెయ్యిపరుగులకు పైగా సాధించిన ప్రణవ్ ధన్వాడేను అండర్ 19 జట్టుకు ఎంపిక చేయకపోవడాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ మెసేజ్ సోషల్ మీడియాలో బాగా ప్రచారమవుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే...'నీలా నా తండ్రి మాజీ క్రికెటర్ కాదు. కేవలం ఆటోడ్రైవర్...నీలా నేను సెలెక్టర్లను మేనేజ్ చేయలేను. ఎందుకంటే నా తల్లిదండ్రులకు అంత స్తోమతలేదు. నీలా నేను అగ్రకులానికి చెందిన వాడిని కాదు. నాకున్నది కేవలం టాలెంటే. అందుకే నేను సెలక్టర్లకి కనబడలేదు' అంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సోషల్ మీడియాలో ప్రణవ్ ధన్వాడేను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై ప్రణవ్ తండ్రి ప్రశాంత్ మాట్లాడుతూ, ఇలాంటి ప్రచారం సరికాదని పేర్కొన్నాడు. అండర్ 16కు ఆడని తన కుమారుడుని ఎలా జట్టులోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అర్జున్, తన కుమారుడు మంచి స్నేహితులని, ప్రతిరోజూ మాట్లాడుకుంటారని ఇలాంటి ప్రచారం కారణంగా వారిద్దరిపై ఒత్తిడి పెరుగుతుందని, అది మంచిది కాదని ఆయన సూచించారు. కాగా, జట్టులో మరో 10 మంది ఉండగా, కేవలం అర్జున్ పై మాత్రమే ఈ ప్రచారం ఎందుకు? అని వారి కోచ్ ప్రశ్నిస్తున్నారు. అయితే నెటిజన్లు మాత్రం క్రికెట్ లో రాజకీయాలు ఆటను నాశనం చేస్తాయని అంటున్నారు. ఇదే సమయంలో గవాస్కర్ కుమారుడికి ఎన్నో అవకాశాలు కల్పించి టీమిండియా ప్రోత్సహించినా అతను రాణించకపోవడాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.

More Telugu News