: 4జీ గోలంతా మార్కెటింగ్ గిమ్మిక్కే!

స్మార్ట్ ఫోన్లు మరింత వేగంగా పనిచేస్తాయని, పెద్ద పెద్ద సినిమాలను సులువుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెబుతూ, 4జీ తరంగాల ప్రమోషన్ నిమిత్తం టెల్కోలు మార్కెటింగ్ గిమ్మిక్కులు చేస్తున్నాయని టెలికం రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 4జీ పేరిట వినియోగదారుల జేబుల నుంచి మరింత పిండుకోవడం మినహా, కస్టమర్లకు దక్కే ప్రయోజనం అత్యంత స్వల్పమని అభిప్రాయపడ్డారు. మొబైల్ బ్రాడ్ బ్యాండ్ టెక్నాలజీకి సంబంధించినంత వరకూ భారత టెలికం పరిశ్రమ ఇప్పుడు రెండుగా చీలిందని, 4జీ తరంగాల సేవలను కేవలం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ సంస్థలు మాత్రమే దేశవ్యాప్తంగా అందించనున్నాయని వివరించారు. వాస్తవానికి ఇండియా ఇంకా 4జీ తరంగాల సేవలను అందించేందుకు ఇంకా సిద్ధం కాలేదన్నది ఓ వాదన. గత రెండేళ్లలో డేటా సేవల ద్వారా టెలికం సంస్థలు పొందుతున్న ఆదాయం 120 శాతం మేరకు పెరిగింది. భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఐడియా సెల్యులార్ వంటి సంస్థలు లబ్ధిని పొందాయి. ఈ కంపెనీల ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇక వాస్తవ పరిస్థితిని గమనిస్తే, ముంబై వంటి నగరాల్లో వోడాఫోన్ సంస్థ తన 3జీ సేవల్లో భాగంగా 8 ఎంబీపీఎస్ (డౌన్ లోడ్), 4 ఎంబీపీఎస్ (ఆప్ లోడ్) వేగాన్ని అందిస్తోంది. ఇక ఓ వినియోగదారుడు కొత్తగా 4జీ ఫోన్ కొని ఎందుకుమారాలన్నది ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న. ఇంకా 3జీ గొడుగు కిందకు రావాల్సిన కస్టమర్లు కోట్ల సంఖ్యలోనే ఉన్నారు. "ఉదాహరణకు ఓ వీడియోను చూడాలంటే సెకనుకు 256 నుంచి 512 కిలోబైట్ల వేగం చాలు. రూ. 4 వేలు పెట్టి ఓ 4జీ ఫోన్ కొనుగోలు చేసి 20 ఎంబీపీఎస్ వేగాన్ని పొందాలని చూస్తే, అది అత్యాశే. ఫోన్ కొన్న తరువాత కస్టమర్ తాను చేసిన తప్పేంటో అర్థమవుతుంది. అనుభవమైతే గాని, 4జీ మార్కెటింగ్ ఓ గిమ్మిక్ అని తెలుస్తుంది. 750 మెగాబైట్ల డేటాకు రూ. 150 చెల్లించేందుకు సిద్ధపడటానికే కోట్ల మంది కస్టమర్లు వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 4జీ అవసరమా?" అని ఐడియా సెల్యులార్ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా ప్రశ్నించారు. వోడాఫోన్ సీఈఓ సునీల్ సూద్ సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. కేవలం సంఖ్యలో మాత్రమే 4జీ పెద్దదని, అంతకు మించి పెద్దగా లాభం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని సంస్థలు తమ స్వప్రయోజనాలకు 4జీ తరంగాలను గొప్పగా చూపేందుకు యత్నిస్తూ, వినియోగదారులను మభ్యపెడుతున్నాయని భారతీ ఎయిర్ టెల్ పేరును చెప్పకుండా విమర్శలు గుప్పించారు.

More Telugu News