: అమేజాన్ వినూత్న టెక్నాలజీ... 'కన్ను కొడితే చాలు' కోరుకున్న వస్తువు ఇంటికి!

ఈకామర్స్ దిగ్గజం అమేజాన్ వినూత్న టెక్నాలజీని కనుగొని దానికి పేటెంట్ ను పొందింది. సాధారణంగా ఆన్ లైన్ మాధ్యమంగా ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలంటే, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలతో పాటు వన్‌ టైమ్ పాస్‌ వర్డ్‌ ను టైప్ చేయాల్సి వుంటుందన్న సంగతి తెలిసిందే. లేకుంటే సీఓడీ (క్యాష్ ఆన్ డెలివరీ) సౌకర్యాన్ని ఎంచుకోవాలి. ఈ వ్యవహారాలకు చెక్ పెడుతూ, సెల్ ఫోన్ ముందు నచ్చిన వస్తువును ఎంపిక చేసుకుని ఓసారి కన్ను కొడితే, ఆటోమేటిక్ గా మీ బ్యాంకు నుంచి డబ్బులు బట్వాడా అయిపోయి వస్తువు మీ ఇంటికి వచ్చేస్తుంది. ఈ విధానంలో ఎటువంటి సందేహాలకు తావులేదని కూడా అమేజాన్ చెబుతోంది. త్వరలోనే దీన్ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. ఇందుకోసం తొలుత ఒక్కసారి సెల్ఫీలను, ఆపై బ్యాంకు వివరాలను అమేజాన్ సైట్ కు అందించాల్సి వుంటుంది. కాగా, గతంలో మాస్టర్ కార్డ్ సెల్ఫీతో చెల్లింపులను పరిచయం చేస్తూ, 'సెల్ఫీ పే'ను అభివృద్ధి చేసినప్పటికీ, అందులో మోసాలు జరిగే అవకాశాలు ఉండటంతో పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఈ కొత్త టెక్నాలజీలో కెమెరా ఎదురుగా ఉన్నది తమ కస్టమరేనన్న విషయం మరింత స్పష్టంగా నిర్థారణ అవుతుందని అమేజాన్ చెబుతోంది. అన్నట్టు కన్ను కొట్టడం మాత్రమే కాదు, తలను మీకు మాత్రమే ప్రత్యేకమైన దిశలో తిప్పడం, ఓ విధంగా నవ్వడం లేదా వెక్కిరించడం వంటివి కూడా మీ 'పాస్ వర్డ్'గా ఎంచుకోవచ్చండోయ్.

More Telugu News