: విజయ్ మాల్యాకు రుణాలిచ్చిన బ్యాంకులకు ఊరట!... ఆయన పేరిట ఇంకా రూ.5,500 కోట్ల ఆస్తులున్నాయట!

విజయ్ మాల్యాకు అప్పులిచ్చి అయోమయంలో పడిపోయిన 17 బ్యాంకులకు కాస్త ఊరట లభించింది. మాల్యా పేరిట ఇంకా రూ.5,500 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయన్న విషయం తాజాగా వెలుగు చూసింది. అప్పులు తీర్చేందుకు మాల్యా ముందుకొస్తే సరేసరి, లేదంటే తాజాగా వెలుగుచూసిన ఈ ఆస్తులను అటాచ్ చేసుకుని అయినా, కొంతలో కొంత మేర రుణాలను రాబట్టుకునే విషయంపై బ్యాంకులు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే మాల్యా తమకు గ్యారెంటీగా పెట్టిన ఆస్తులను విక్రయించిన బ్యాంకులు రూ. 1,200 కోట్లను రాబట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన రూ.5,500 కోట్ల విలువ చేసే ఆస్తులను మాల్యా బ్యాంకులకు తాకట్టు పెట్టలేదు. ఇలా తాకట్టు పెట్టని ఆస్తులపై బ్యాంకులకు హక్కు లేకున్నా, కోర్టులను ఆశ్రయించి వాటిని దక్కించుకునే అవకాశాలు లేకపోలేదు. మాల్యా దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన నేపథ్యంలో ఆయన ఆస్తులను కోర్టులు జప్తు చేసే అవకాశాలున్నాయి. ఈ ఆస్తులను వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్ముతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను బకాయిలతో పాటు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, పీఎఫ్ బకాయిలు తీర్చేసే అవకాశాలున్నట్లు సమాచారం. తాజాగా గుర్తించిన మాల్యా ఆస్తుల్లో బెంగళూరుకు చెందిన లగ్జరీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ‘యూబీ సిటీ’ కీలకమైనదిగా తెలుస్తోంది.

More Telugu News