: అరుణ్ 'జై' అన్న త్రి'బుల్' సెవన్!

అరుణ్ జైట్లీ బడ్జెట్ కు భారత స్టాక్ మార్కెట్ బుల్ జైకొట్టింది. అది కూడా అలా ఇలా కాదు. ఏకంగా 777 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ బుల్ ఇటీవలి కాలంలో అత్యధిక హైజంప్ చేసింది. దీంతో మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద రూ. 2.50 లక్షల కోట్లకు పైగా పెరిగి అరుణ్ జైట్లీకి 'త్రీ చీర్స్' చెప్పినట్లయింది. నిన్న బడ్జెట్ ప్రసంగ సమయంలో 600 పాయింట్ల నష్టం నుంచి నిమిషాల వ్యవధిలో తేరుకున్నప్పుడే, బడ్జెట్ ప్రతిపాదనలు మార్కెట్ వర్గాలను మెప్పించాయని అందరూ అంచనా వేశారు. ఆ ప్రభావం నేడు స్పష్టంగా కనిపించింది. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం వంటి వ్యక్తులు కూడా బడ్జెట్ బాగుందని చేసిన మెచ్చుకోలు వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను ఇనుమడింప చేశాయి. ఇదే సమయంలో ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండటం, ఆపై యూరప్ సెషన్ ఆశాజనకంగా నడుస్తుండటంతో, సెన్సెక్స్, నిఫ్టీలకు తిరుగులేకుండా పోయింది. బడ్జెట్ ప్రతిపాదనలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న ఎన్నో కంపెనీలు 20 శాతం లాభాలను నమోదు చేయగా, అప్పర్ సర్క్యూట్ ను తాకిన న్యూక్లియస్ సాఫ్ట్, ఇగరాశి మోటార్స్ వంటి కంపెనీల్లో ట్రేడింగ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. మధుకాన్ ప్రాజెక్ట్స్, సువెన్ లైఫ్ సైన్సెస్, శక్తి పంప్స్ వంటి కంపెనీలు 19 శాతానికి పైగా లాభపడ్డాయి. ఆటో ఇండెక్స్ కంపెనీలన్నీ దాదాపుగా లాభాల్లోనే నడిచాయి. మారుతి సుజుకి అత్యధికంగా 8 శాతానికి పైగా పెరిగింది. హీరో మోటో, టాటా మోటార్స్, ఎంఆర్ఎఫ్ వంటి కంపెనీలు ఐదు శాతానికి పైగా లాభపడ్డాయి. కాగా, ఈ సెషన్ ఆరంభంలో క్రితం ముగింపు వద్ద ప్రారంభమైన సూచికలు ఏ దశలోనూ వెనుదిరిగి చూడలేదు. నల్లధనంపై జైట్లీ చేసిన వ్యాఖ్యలకు తోడు స్టార్టప్ సంస్థలకు ప్రాధాన్యత, మేకిన్ ఇండియాకు తోడ్పాటు వంటి నిర్ణయాలు ఇన్వెస్టర్లను నూతన కొనుగోళ్లవైపు నడిపించాయి. దీంతో మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 777.35 పాయింట్లు పెరిగి 3.38 శాతం లాభంతో 23,779.35 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 235.25 పాయింట్లు పెరిగి 3.37 శాతం లాభంతో 7,222.30 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 3.04 శాతం, స్మాల్ క్యాప్ 3.23 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 47 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. ఐటీసీ, వీఈడీఎల్, గెయిల్, అదానీ పోర్ట్స్, టీసీఎస్ తదితర కంపెనీలు లాభపడగా, ఓఎన్జీసీ, హిందుస్థాన్ యూనీలీవర్, డాక్టర్ రెడ్డీస్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,705 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,999 కంపెనీలు లాభాల్లోను, 590 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. సోమవారం నాటి సెషన్ ముగింపు సమయంలో రూ. 85,90,869 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 88,41,871 కోట్లకు పెరిగింది.

More Telugu News