: 'లే ఆఫ్'ల బాటలో స్నాప్ డీల్!... సోషల్ మీడియాలో వదంతులు వైరల్

దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ‘స్నాప్ డీల్’ లే ఆఫ్ ల బాట పట్టిందన్న వార్తలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. కంపెనీకి చెందిన 200 మందికి యాజమాన్యం పింక్ కార్డులు జారీ చేసిందన్న వార్తలపై నిరసన తెలిపిన ఉద్యోగులు గుర్గావ్ లోని సంస్థ ప్రధాన కార్యలయం ఎదుట ఆందోళనకు దిగారు. నిన్నంతా వారు మండుటెండలోనే నిలబడి నిరసన తెలిపారు. ఈ-కామర్స్ రంగంలో మంచి వృద్ధినే నమోదు చేస్తున్న ఈ సంస్థ... తన కస్టమర్ కేర్ విభాగానికి చెందిన దాదాపు వెయ్యి మంది సిబ్బంది పనితీరుపై ఇటీవల నిశిత పరిశీలన చేసిందట. ఈ పరిశీలనలో యాజమాన్యం ఆశించిన మేర పనితీరు కనబరచడంలో సిబ్బంది విఫలమైనట్లు తేలింది. దీంతో ఫెర్ ఫార్మెన్స్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్ (పీఐపీ) కింద ప్రత్యేకంగా రూపొందించిన శిక్షణా తరగతులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సదరు శిక్షణకు వెళ్లేందుకు కొంతమంది సిబ్బంది నిరాకరించారు. ఇదిలా ఉంటే, ఒకేసారి ఏకంగా 600 మంది సిబ్బందిని యాజమాన్యం తొలగించిందన్న వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. దీంతో మీడియా ముందుకు వచ్చిన కంపెనీ అధికార ప్రతినిధి ఆ వార్తలను కొట్టేశారు. పనితీరు మెరుగుపరుచుకునేందుకు మెజారిటీ సిబ్బంది ఆసక్తి చూపగా, కొంతమంది నిరాకరించారని తెలిపారు. అయితే సిబ్బంది తొలగింపు వార్తలు అవాస్తవమని ఆ ప్రతినిధి పేర్కొన్నారు.

More Telugu News