: ఇంకా పాతాళంలోకి, ఇన్వెస్టర్లకు మరింత బాధ... మరో మార్గమేంటి?

గురువారం నాటి సెషన్లో 800 పాయింట్లకు పైగా పతనమై ఇన్వెస్టర్లకు చెందిన రూ. 3 లక్షల కోట్లకు పైగా హరించేసిన మార్కెట్ పతనం నేడూ కొనసాగుతోంది. ఈ సెషన్ ఆరంభంలో కాస్తంత ఫర్వాలేదనిపించిన మార్కెట్ 11:30 గంటల తరువాత పట్టు నిలుపుకోలేక జారిపోయింది. అన్ని రంగాల్లోని ఈక్విటీలకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో మధ్యాహ్నం 12:35 నిమిషాల సమయానికి సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా దిగజారింది. మరో రూ. 1.25 లక్షల కోట్లు హారతి కర్పూరమయ్యాయి. గత శుక్రవారం నాటి స్థాయితో పోలిస్తే, నిఫ్టీ సూచిక 24 శాతానికి పైగా పడిపోయి ఇన్వెస్టర్లకు మరింత బాధను మిగిల్చింది. ఇక ఈ సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి ఎంటర్ కావద్దన్నది నిపుణుల సలహా. ఈ పతనం మరింత ఘోరంగా ఉండవచ్చని భావిస్తున్న ట్రేడర్లు, ప్రస్తుతానికి ఎటువంటి పొజిషన్లు తీసుకోరాదని చెబుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో స్టాక్ మార్కెట్లు స్థిరపడే వరకూ కొత్తగా ఈక్విటీలు కొనుగోలు చేస్తే నష్టమే తప్ప లాభం ఉండదని ఐడీబీఐ కాపిటల్ రీసెర్చ్ విభాగం హెడ్ ఏకే ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఈ కరెక్షన్ నిఫ్టీని 6,357 పాయింట్ల వరకూ తీసుకెళుతుందని ఆయన అన్నారు. అక్కడ కూడా నిలవకుంటే, మరోసారి 2008 నాటి పతనం తప్పక పోవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం 15 వేల స్థాయిలో ఉన్న అమెరికాలో డోజోన్ సూచిక ఇండస్ట్రియల్ యావరేజ్ 25 నుంచి 30 శాతం వరకూ పడిపోవచ్చని, ప్రపంచ మార్కెట్లు అదే దారిలో నడవక తప్పదని ఆయన అన్నారు. దాదాపు ఇదే విధమైన అభిప్రాయాన్ని కేఆర్ చౌక్సీ షేర్స్ చీఫ్ దేవన్ చోక్సీ కూడా వెలిబుచ్చారు. ఏ విధమైన పాజిటివ్ సంకేతాలూ అందే పరిస్థితి కనిపించడం లేదని, రెండు వారాల తరువాతి బడ్జెట్ ను చూసిన తరువాతనే భారత మార్కెట్ గమనంపై ఓ అంచనాకు రావచ్చని ఆయన తెలిపారు. జీడీపీతో పోలిస్తే మార్కెట్ కాప్ 2008లో 0.55:1కి తగ్గిపోయిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుతం 0.59:1గా ఉన్న మార్కెట్ కాప్ మరింతగా నష్టపోవచ్చని దేవన్ అభిప్రాయపడ్డారు. కనీసం ఈక్విటీలను సరాసరి చేసుకునే అవకాశాలూ కనిపించడం లేదని, మార్కెట్లలో ఉన్న డబ్బును కొంత నష్టాన్ని భరించైనా తీసేసుకుని మరో అవకాశం కోసం వేచి చూడటం ఉత్తమమని సలహా ఇచ్చారు.

More Telugu News