: తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ‘త్రిబుల్’ వేతనం కోరుతున్నారట!... నేషనల్ మీడియాలో ఆసక్తికర కథనం

తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వేతనాన్ని ‘త్రిబుల్’ చేయాలని కోరుతున్నారట. ఈ మేరకు తమ నెలవారీ ఖర్చులు, అందుతున్న వేతనాలను ప్రస్తావిస్తూ... వేతనం పెంపు తప్పనిసరి అంటూ వారు సీఎం కేసీఆర్ తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి వినతి పత్రాలు సమర్పించారు. ప్రజా ప్రతినిధుల అభ్యర్థనలపై నిన్న సమీక్షించిన కేసీఆర్, సదరు ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు నిన్న సీఎంఓ నుంచి విడుదలైన ఓ పత్రికా ప్రకటనను ఉటంకిస్తూ నేషనల్ మీడియా ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నెలకు రూ.3 లక్షల మేర ఖర్చవుతోందట. నెలకు రూ.95 వేల మేర వేతనం అందుతుండగా, ఖర్చు మాత్రం దానికి మూడింతలు ఉందని వారు వాపోతున్నారు. అంతేకాక ఇటీవల ఢిల్లీ, ఇతర రాష్ట్రాల ప్రజా ప్రతినిధుల వేతనాలను పెంచిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వేతనాలను పెంచమంటూ సీఎంను కోరారట. సీఎం కూడా సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో త్వరలోనే వీరి వేతనాలు మూడింతలు కానున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.

More Telugu News