: గ్రేటర్ మేయర్ విజయలక్ష్మా? రామ్మోహనా?... తేల్చేందుకు కదిలిన కేసీఆర్!

ఇటీవలి గ్రేటర్ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 99 డివిజన్లలో విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు మేయర్ పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలన్న విషయాన్ని తేల్చేందుకు తలమునకలై ఉంది. అధినేత కేసీఆర్ చెప్పిన పేరుకే ఆమోదం పడుతుందన్న విషయం అందరికీ తెలిసినా, ఎవరికి వారు తమవంతు ప్రయత్నాలు చేస్తూ తెలిసిన నేతలతో సిఫార్సులు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు సాయంత్రంలోగా కేసీఆర్ కొంత మంది కార్పొరేటర్లతో భేటీ అయి వారి అభిప్రాయాలను స్వీకరిస్తారని, ఆపై మేయర్ గా ఎవరిని నిలపాలన్న విషయమై ఓ అభిప్రాయానికి రావచ్చని తెలుస్తోంది. కాగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా నిలిచిన బొంతు రామ్మోహన్ పేరుతో పాటు ఎంపీ కేశవరావు కుమార్తె, బంజారాహిల్స్ డివిజన్ నుంచి మంచి మెజారిటీతో గెలిచిన విజయలక్ష్మీ గద్వాల్ పేర్లు మేయర్ పదవికి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలోనే ఒకరికి పదవి లభిస్తుందని సమాచారం. ఇక రేపు ఉదయం అందరు కార్పొరేటర్లతోనూ చివరిగా సమావేశమయ్యే కేసీఆర్, కేటీఆర్ తదితరులు తుది నిర్ణయం తీసుకున్న తరువాతనే, కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయలుదేరుతారని సమాచారం. ఇదిలావుండగా, జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించి రెండు డిప్యూటీ మేయర్ పదవులను సృష్టించి, ఒకదాన్ని ముస్లింలకు, రెండవది సెటిలర్లకు ఇచ్చి ఇరు వర్గాలకూ మరింత దగ్గరయ్యేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

More Telugu News