: వేతనాలు పెంచేందుకు ఇన్ఫోసిస్ సరికొత్త సిస్టమ్ 'ఐ కౌంట్'!

ఉద్యోగుల నుంచి మరింత నైపుణ్యాన్ని వెలికితీసేలా సరికొత్త వేతన పెంపు విధానం 'ఐ కౌంట్'ను ఇండియాలోని రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ అమలు చేయనుంది. తమకు కేటాయించిన లక్ష్యాలను చేరుకునే దిశగా, ఉద్యోగులు చేసే కృషిని బట్టి మార్కులను కేటాయించడమనే విధానమే ఐ కౌంట్. ఇందులో భాగంగా వార్షిక పనితీరు పరీక్ష స్థానంలో ఎప్పటికప్పుడు ఉద్యోగుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడంతో పాటు, వారి పనితీరుపై సమీక్షలు జరుపుతామని ఇన్ఫీ ప్రతినిధి ఒకరు తెలిపారు. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ శిక్కా మదిలో నుంచి వచ్చిన 'న్యూ అండ్ రెన్యూ' స్ట్రాటజీకి అనుగుణంగా ఇది పని చేస్తుందని తెలిపారు. ఓ గ్రూప్ పనితీరు ఎలా ఉందన్న విషయంపై కాకుండా, వ్యక్తిగత పనితీరు, నైపుణ్యాలపై దృష్టిని సారించనున్నామని సంస్థ సీనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ లోబో తెలిపారు. సంస్థలో 1.93 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, వారికి ఇంతవరకూ 'ఓపెన్ ర్యాంకింగ్' విధానంలో మార్కులు వేశామని, ఇకపై ఆ విధానాన్ని అమలు చేయబోమని ఆమె స్పష్టం చేశారు.

More Telugu News