: ఆ 62 మంది సంపద మిగతా ప్రపంచ సంపదకు సమానం!

ప్రపంచంలో ధనికులు మరింత ధనవంతులుగా మారుతుండగా, పేదలు నిరుపేదలౌతున్నారని మరోసారి నిరూపితమైంది. 2010 నుంచి ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన 62 మంది సంపద 44 శాతం పెరుగగా, ప్రస్తుతం వారి వద్ద ఉన్న సంపద, మిగతా జనాభా మొత్తం దగ్గరున్న సంపదతో సమానమైంది. ఇదే సమయంలో ప్రపంచంలోని 350 కోట్ల మంది పేదల వద్ద ఉన్న డబ్బు 41 శాతం తగ్గింది. అంతర్జాతీయ చారిటీ సంస్థగా గుర్తింపున్న 'ఆక్స్ ఫామ్' స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు నేపథ్యంలో తన నివేదికను విడుదల చేసింది. ఈ సూపర్ రిచ్ జాబితాలో సగం మంది అమెరికా, 17 మంది యూరప్ కు చెందిన ధనికులు ఉండగా, మిగతావారు చైనా, బ్రెజిల్, మెక్సికో, జపాన్, సౌదీ అరేబియా వాసులని ఆక్స్ ఫామ్ వెల్లడించింది. ఈ తరహాలో ధనికులు, పేదల మధ్య అంతరం పెరుగుతుండటం కొత్త సమస్యలకు కారణం కావచ్చని ఆక్స్ ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బయానిమా వ్యాఖ్యానించారు. వందల కోట్ల మంది అన్నం కోసం ఆకలితో అలమటించే పరిస్థితులను రూపుమాపాలని ఆయన కోరారు. ప్రపంచంలోని ధనవంతుల సంపదలో 7.6 ట్రిలియన్ డాలర్ల మొత్తంపై పన్నులు రావడం లేదని, ఈ డబ్బుపై పన్నులు చెల్లిస్తే, దాదాపు 190 బిలియన్ డాలర్లు అందుబాటులోకి వచ్చి పేదల కడుపు నింపవచ్చని కాలిఫోర్నియా యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గాబ్రియేల్ జుక్ మాన్ వ్యాఖ్యానించారు.

More Telugu News