: వెల్లువెత్తిన పెట్టుబడులు...లాభాల్లో మార్కెట్లు!

లాంగ్ వీకెండ్ తరువాత భారత స్టాక్ మార్కెట్ కంపెనీలు సత్తా చాటాయి. పలు లార్జ్ కాప్ కంపెనీల ఈక్విటీలతో పాటు, స్మాల్, మిడ్ కాప్ కంపెనీల్లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా విదేశీ సంస్థగత ఇన్వెస్టర్లు ఈక్విటీలను పెద్దఎత్తున కొనుగోలు చేశారు. మరోవైపు షార్ట్ సెల్లింగ్ కూడా జరగడంతో సెషన్ ఆరంభం నుంచే మార్కెట్ లాభాల్లోకి దూసుకెళ్లింది. దీంతో సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 195.42 పాయింట్లు పెరిగి 0.76 శాతం లాభంతో 26,034.13 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 64.10 పాయింట్లు పెరిగి 0.82 శాతం లాభంతో 7,925.15 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.14 శాతం, స్మాల్ క్యాప్ 0.47 శాతం లాభాలను నమోదు చేశాయి. ఎన్ఎస్ఈ-50లో 33 కంపెనీలు లాభాల్లో నడిచాయి. డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు లాభపడగా, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, ఏసీసీ, గ్రాసిమ్, ఐడియా తదితర కంపెనీలు నష్టపోయాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, రూ. 99,94,734 కోట్లకు చేరుకుంది. మొత్తం 2,954 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,538 కంపెనీలు లాభాలను, 1,161 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News