: ఎన్నాళ్లు ఎదురుచూడాలో?... ప్రపంచాన్ని ఊపేస్తూ, ఇండియాకు రాని కొత్త గాడ్జెట్లు!

ఇది గాడ్జెట్ల యుగం. ఎన్నో వినూత్న గాడ్జెట్లు ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. మరెన్నో కొత్తవి తయారవుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాల్లో మార్కెట్లోకి వచ్చేసిన ఎన్నో గాడ్జెట్లు ఇండియాలో ఇంకా విడుదల కాలేదు. వీటిని గురించి తెలుసుకోవడం, రివ్యూలు చదివి, మనకూ అందుబాటులో ఉంటే బాగుండునని కోరుకుంటున్న భారత గాడ్జెట్ ప్రియులెందరో. ఈ నేపథ్యంలో, ఇండియాకు ఇంకా రాని ప్రాచుర్యం పొందిన గాడ్జెట్ల వివరాలివి... హెర్క్యులస్ మోషన్ కెమెరా: ఫోటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్ రంగాల్లో ఉన్నవారికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. ప్రపంచంలోని అతిచిన్న కదిలే కెమెరా ఇది. జేబులో పెట్టేసుకోచ్చు. స్మార్ట్ పోన్ తో నియంత్రించవచ్చు. కేవలం 110 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. యాంపీ, వాక్ అండ్ చార్జ్: ఇది మోషన్ చార్జర్. నడుస్తూ ఉంటే చార్జింగ్ అవుతుంది. ఓ గంట పాటు సైకిల్ తొక్కినా, ఓ 10 వేల అడుగులు వేసినా పూర్తిగా చార్జింగ్ అవుతుంది. గతిజ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సూత్రంతో తయారైన దీని ధర 100 డాలర్లు (సుమారు రూ. 6,500). స్కైబడ్స్: ఇవి వైర్ లెస్ ఇయర్ బడ్స్. ఎప్పుడో చూసిన ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా తరువాత వచ్చిన ఆలోచనతో ఇవి తయారయ్యాయి. స్మార్ట్ ఫోన్ కు ఏ విధమైన అటాచ్ మెంటు లేకుండా వీటిని వాడుకోవచ్చు. ఇన్ బిల్ట్ బ్యాటరీ కూడా వీటిలో ఇమిడి ఉంటుంది. చెవిలో సులువుగా పెట్టుకుని వెళ్లిపోవచ్చు. దీని ధర 300 డాలర్లు (సుమారు రూ. 19,800) పవర్ ఇన్ యువర్ ఫింగర్: మీ వేలికి ఉంగరంలా తొడుక్కుని, స్మార్ట్ ఫోన్ ను నియంత్రించగల వినూత్న గాడ్జెట్ ఇది. దీని పేరు 'రింగ్'. ఇది బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది. పిక్చర్ తీసుకోవడం నుంచి మ్యూజిక్ ను ప్లేచేయడం వంటి ఎన్నో పనులను స్మార్ట్ ఫోన్ స్క్రీన్ తాకకుండా దీని ద్వారా చేసుకోవచ్చు. ఒకసారి చార్జింగ్ తో మూడు రోజులు పనిచేసే దీని ధర 270 డాలర్లు. (సుమారు రూ. 17,800) ట్రాక్ ఆర్ స్టిక్కర్: మీ బైక్ లేదా కారు కీస్, ఇంటి తాళాలు, మరేదైనా అత్యవసర వస్తువు వంటివి ఎక్కడున్నాయో కనుక్కోవడం ఒక్కోసారి చాలా తలనొప్పి తెచ్చి పెడుతుంది. దీనికి సమాధానమే ట్రాక్ ఆర్ స్టిక్కర్. ఓ చిన్న నాణెం సైజులో ఇది ఉంటుంది. దీన్ని సులువుగా మీ వస్తువులకు తగిలించవచ్చు. ఆపై అది ఎక్కడుందో మీ స్మార్ట్ ఫోన్ నుంచి తెలుసుకోవచ్చు. ట్రాకర్ బటన్ నొక్కగానే పెద్దగా శబ్దం వినిపిస్తుంది. దీని ధర 25 డాలర్లు (సుమారు రూ. 1,650) ఫిరీ: దీన్ని ఉపయోగించి ఎక్కడైనా ఏదైనా రాసేయొచ్చు. అది డైరెక్టుగా మీ స్మార్ట్ ఫోన్లో చేతిరాత, లేదా టైప్డ్ టెక్ట్స్ రూపంలో చేరిపోతుంది. ఓ పెన్నులా ఉండే ఈ గాడ్జెట్ కూడా బ్లూటూత్ సాయంతో పనిచేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్, వన్ నోట్, ఈవర్ నోట్, గూగుల్ హ్యాండ్ రైటింగ్ కీబోర్డు తదితరాలకు కంపాటబుల్. దీని ధర 190 డాలర్లు (సుమారు రూ. 12,560) మోటరోలా స్కౌట్ 5000: మీ పెంపుడు జంతువులు ఎక్కడున్నాయో కనిపెట్టి చెప్పే గాడ్జెట్ ఇది. దీన్ని ఓ బెల్ట్ సాయంతో జంతువుల మెడకు కడితే సరి. అందులోని జీపీఎస్, వైఫై, కెమెరా వంటి వాటిని స్మార్ట్ ఫోన్ తో నియంత్రించవచ్చు. ప్రస్తుతానికి యూఎస్ లో మాత్రమే అందుబాటులో ఉన్న దీని ధర 200 డాలర్లు. (సుమారు రూ. 13,220) ఇటువంటివి ఇంకా ఉన్నాయి. ఈ గాడ్జెట్ల రాకకై ఇండియాలో ఎదురుచూస్తున్న వారెందరో!

More Telugu News