ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదనపు ఆదాయాన్ని అందించే మార్గాలిలా!

Thu, Nov 19, 2015, 01:09 PM
ధనవంతుడైన వ్యక్తి నుంచి సామాన్య, మధ్య తరగతి ప్రజల వరకూ, తనకు వస్తున్న సంపాదన జీవనానికి సరిపోతుంది. ఇక అదనపు డబ్బు వద్దు అని చెప్పేవారు ఎవరైనా మీకు తారసపడ్డారా? లేదు కదా? కేవలం ఒకే ఆదాయపు వనరు ఉంటే జీవితం అశాంతి లేకుండా సాగదంటున్నారు నిపుణులు. కేవలం వేతనమో, లేదా చేస్తున్న వ్యాపారంలో లాభమో వస్తుందిలే అని భావించకుండా, తక్కువ మొత్తమైనా, మరో మార్గంలో వచ్చే ఆదాయం ముఖ్యమని చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఓ ఉద్యోగం చేస్తున్నాను. ఇంకో ఉద్యోగం ఎలా చేసి అదనపు ఆదాయం తెచ్చుకోగలను? అని ప్రశ్నించే వారి కోసం, రెండవ, మూడవ ఆదాయ మార్గాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే...

జీవిత భాగస్వామి ఆదాయం: మారుతున్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా, జీవిత భాగస్వామి కూడా ఏదో ఒక వ్యాపకం ద్వారా సంపాదించవచ్చు. అది ఇంట్లో నుంచి కూడా. వచ్చింది కొంచమే అయినా, ఇంటి అవసరాలకు ఉపయోగపడ్డా ఆ మేరకు ఆదా చేసినట్టే. ఇంట్లోనే ఉండి పనిచేసుకునేందుకు ఫ్రీలాన్స్ వర్క్, పార్ట్ టైం వర్క్, ఫ్లెక్సీ- అవర్ వర్క్ లు ఆన్ లైన్లో ఎన్నో ఉన్నాయి. కొద్దిగా చదువుకుంటే ట్యూషన్లు, వంటల్లో అనుభవముంటే కుకింగ్ క్లాసులు, డిజైనింగ్ తదితరాలతో రెండవ ఆదాయం పొందవచ్చు. ఇంట్లో ప్రధాన ఉద్యోగి సంపాదనలో జీవిత భాగస్వామి సంపాదన 20 నుంచి 30 శాతమున్నా అది ఎంతో ఉపయోగపడుతుంది.

హాబీ ఆదాయం: ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఉంటుంది. ఏదో ఒక విషయంలో నైపుణ్యతా ఉంటుంది. తమలో ఏ నైపుణ్యమూ లేదంటే, దాగున్న నైపుణ్యాన్ని కనుక్కోలేకపోయారనే భావించాలి. ఇక దాన్ని తెలుసుకుంటే, అదనపు ఆదాయ మార్గం వచ్చేసినట్టే. పెయింటింగ్, ఫ్యాబ్రిక్స్, డిజైనింగ్, పుస్తకాలు రాయడం, ఫోటోగ్రఫీ, మాట్లాడే శక్తి... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత అవుతుంది. మీ హాబీని వారాంతాల్లో ఉపయోగించుకో గలిగినా 30 శాతం వరకూ ఆదాయం వస్తుంది.

అద్దెలు: మీకు సొంతిల్లు ఉందా? అది జీవితాంతమూ అదనపు ఆదాయాన్ని ఇచ్చే మార్గమే. సొంతిల్లు లేదా? ముందు దాన్ని ఏర్పాటు చేసుకునే ఆలోచన చేయాలి. ఆ ఆలోచనా లేకుంటే, ముగ్గురున్న ఇంట్లో 'పేయింగ్ గెస్ట్'గా ఓ వ్యక్తిని ఆహ్వానించవచ్చు. కూరగాయల ఖర్చులన్నా వస్తాయిగా?

నిష్క్రియాత్మక ఆదాయం: ఇది మీరు నిద్రిస్తున్నా వచ్చేస్తుంటుంది. ఏ పనీ చేయకున్నా ఖాతాలోకి జమవుతుంది. ఉదాహరణకు ఫిక్స్ డ్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్ డివిడెండ్లు వంటివి. కొంత డబ్బు పోగేసి బ్యాంకులో నెలసరి వడ్డీ వచ్చేలా చూసుకుంటే, పెట్టుబడి కదలదు, పైగా ఎంతో కొంత ఆదాయం వస్తుంటుంది.

మేధో సంపత్తి ఆదాయం: మీకున్న విజ్ఞానాన్ని నలుగురికీ పంచడం ద్వారా ఆదాయం వస్తుంది. ఉదాహరణకు ఓ బ్యాంకులో ఉద్యోగిగానో లేక ఐటీ ఉద్యోగిగానో నెలకు రూ. 50 వేలు సంపాదిస్తున్న వ్యక్తి, ఓ స్కూల్ లో రోజుకు రెండు పీరియడ్ల పాటు పాఠాలు బోధించడం ద్వారా మరో రూ. 15 వేలు సంపాదించవచ్చు. దీనికి గాను రోజుకు గంటన్నర సమయం అదనంగా కేటాయించగలిగితే చాలు. ఇక మార్కెటింగ్ నైపుణ్యం ఉండి కొన్ని బీమా పాలసీలను విక్రయించగలిగినా, వారు ప్రీమియం చెల్లిస్తున్నంత కాలమూ మీకు కమిషన్ వస్తుంది.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే...
* ఒక సంపాదనపై నిశ్చిత ఆదాయం వస్తుందని రూఢీ అయిన తరువాతనే రెండో మార్గంపై దృష్టి పెట్టాలి.
* చిన్న మొత్తాలైనా సరే క్రమానుగుణంగా ఆదాయం వచ్చే మార్గాలపైనే దృష్టి పెట్టాలి.
* వస్తున్న ఆదాయంలో కనీస పొదుపు తప్పనిసరి. దీర్ఘకాలంలో ఈ మొత్తం ఇబ్బడిముబ్బడవుతుంది.
X

Feedback Form

Your IP address: 54.196.24.102
Articles (Latest)
Articles (Education)