: యాపిల్ పై పేటెంట్ ఉల్లంఘన కేసు... రూ. 5,600 కోట్ల జరిమానా!

యాపిల్ సంస్థపై యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్ దాఖలు చేసిన మేధోసంపత్తి హక్కుల కేసును విచారించిన మాడిసన్ న్యాయస్థానం, యాపిల్ పేటెంట్ హక్కులను ఉల్లంఘించినట్టు అభిప్రాయపడింది. ఈ కేసులో 862 మిలియన్ డాలర్లు (సుమారు 5,600 కోట్లు) జరిమానా విధించవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఏ7, ఏ8, ఏ8ఎక్స్ సిస్టమ్ చిప్ డిజైన్ల విషయమై తమకున్న ఐపీఆర్ (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్)లను యాపిల్ అనుమతి లేకుండా వాడుకుందని విస్కాన్సిస్ అలుమ్నీ రీసెర్చ్ ఫౌండేషన్ కేసు దాఖలు చేసింది. 2013, 2014 సంవత్సరాల్లో యాపిల్ విడుదల చేసిన ఐఫోన్, ఐపాడ్ లలో వీటిని వాడారని తెలిపింది. ఈ తరహా సాంకేతికతపై పేటెంట్ హక్కులు అన్న ప్రశ్నే తలెత్తబోదని సంస్థ వాదించినప్పటికీ, కోర్టు దాన్ని అంగీకరించ లేదు. 1998లో 'టేబుల్ బేస్డ్ డేటా స్పెక్యులేషన్ సర్క్యూట్ ఫర్ పారలెల్ ప్రాసెసింగ్ కంప్యూటర్' పేరిట విస్కాన్సిస్ కు ఐపీఆర్ హక్కులు లభించాయి. ఇది ప్రాసెసర్ పనితీరును మెరుగుపరిచే సాంకేతిక పరిజ్ఞానం. దీన్ని యాపిల్ వాడిందని, అందువల్ల వర్శిటీకి పరిహారం చెల్లించాల్సిందేనని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఇక ఆ రెండు సంవత్సరాల్లో ఈ తరహా సిస్టమ్ ను వాడి యాపిల్ పొందిన ఆదాయంపై వర్శిటీకి ఎంత వాటా వస్తుందో లెక్కగట్టే పనిలో న్యాయస్థానం నియమించిన ఓ కమిటీ తలమునకలైవుంది.

More Telugu News