: ఇల్లు కొనాలా నాయనా...? రుణాలపై పోటీ పడుతూ వడ్డీలు తగ్గిస్తున్న బ్యాంకులు

కొత్తగా ఇల్లు కొనాలని భావించే వారికి ఇదే సరైన తరుణం. పలు బ్యాంకులు గృహ రుణాలపై తీసుకునే వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించడంలో పోటీలు పడుతున్నాయి. కస్టమర్లకు రుణాలివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు, భారత్ లో అధిక గృహ రుణాలిస్తున్న హెచ్ డీఎఫ్ సీ, ఈ రంగంలో దూసుకొస్తున్న ఐసీఐసీఐ, ఎల్ఐసీ హౌసింగ్ తదితర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడంలో పోటీ పడుతున్నాయి. గత నెలలో ఆర్బీఐ పరపతి సమీక్షలో అర శాతం మేరకు రెపో రేట్లను తగ్గించిన తరువాత దేశ నిర్మాణ రంగంలో కొత్త ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ స్తబ్దుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేగం పుంజుకుంది. అయితే, వడ్డీ తగ్గింపులు ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉన్నాయి. తగ్గింపు తేడా 15 నుంచి 35 బేసిస్ పాయింట్ల మధ్య ఉంది. దీంతో ఆకర్షణీయంగా ఉన్న బ్యాంకుల ముందు కస్టమర్లు క్యూ కడుతుండగా, మిగతా బ్యాంకులు మరింతగా వడ్డీని తగ్గించక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. కాగా, డిజిటల్ ఇండియా ప్రమోషన్ లో భాగంగా కేంద్రం ప్రకటించిన స్మార్ట్ నగరాల్లో, మిగతా ప్రాంతాలతో పోలిస్తే రియాల్టీ వేగంగా పుంజుకుంటున్నదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఎస్బీఐ 9.55 శాతానికి, హెచ్ డీఎఫ్ సీ 9.65 శాతానికి గృహ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. మహిళా కస్టమర్లకు మరో 0.05 శాతం తక్కువ వడ్డీలకు రుణాలిస్తున్నాయి. నేడో రేపో హెచ్ డీఎఫ్ సీ కనీసం 10 నుంచి 15 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీ తగ్గిస్తున్నట్టు ప్రకటిస్తుందని సమాచారం. తాము ఎంతో కాలం నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు కోసం ఎదురుచూశామని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న రిచా రియల్టర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ అహూజా వ్యాఖ్యానించారు. కొత్తగా కొనుగోళ్ల కోసం ప్రజల నుంచి ఆసక్తి పెరుగుతోందని ఆయన అన్నారు. గత సంవత్సర కాలంగా అంతంతమాత్రంగా ఉన్న అమ్మకాలు ఇప్పుడు పుంజుకుంటాయని పలు నిర్మాణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. జనవరి నుంచి పరిశీలిస్తే మొత్తం 125 బేసిస్ పాయింట్ల మేరకు రెపో రేటు తగ్గింది. ఆ స్థాయిలో, అంటే వడ్డీ రేట్లపై కూడా 1.25 శాతం మేరకు తగ్గింపులను మాత్రం బ్యాంకులింకా ఆఫర్ చేయడం లేదు. పలువురు ప్రజలు గత సంవత్సరంతో పోలిస్తే ఒకటింపావు శాతం వడ్డీ రేట్లు తగ్గి గృహ రుణాలు లభిస్తే, ఇల్లు కొందామని భావిస్తున్నారు. బ్యాంకుల్లో ఉన్న పోటీ మరింతగా పెరిగితే, అది సాధ్యమేనని నిర్మాణ రంగ నిపుణుల అంచనా. అప్పుడు 9 శాతం కన్నా దిగువకు వడ్డీ రేటు తగ్గుతుంది.

More Telugu News