: పెరిగేనా? తరిగేనా?... బంగారం ధరలు ఎటువైపు?

సమీప భవిష్యత్తులో బంగారం ధరలు ఎటువైపు వెళ్తాయి? బులియన్ ట్రేడర్లను తొలచివేస్తున్న ప్రశ్న ఇదే. నెలన్నర క్రితం రూ. 24 వేల కన్నా దిగువకు వచ్చిన 10 గ్రాముల బంగారం ధర విలువ ఆపై కొండెక్కి, ప్రస్తుతం రూ. 26,055 వద్దకు చేరింది. ధరలు తగ్గిన సమయంలో ఇంకా తగ్గుతాయని భావించిన ప్రజలకు నిరాశ కలుగగా, నెలన్నర క్రితం బంగారం కొనుగోళ్లు జరిపిన వారు కాస్తంత ఆనందంగానే వున్నారు. మరిక భవిష్యత్ ధరలు ఎటువైపు అని ఆలోచిస్తే... షిన్హువా న్యూస్ ఏజన్సీ గణాంకాల ప్రకారం బంగారం ధరలు మరింతగా తగ్గనున్నాయి. ఈ సంవత్సరంలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తప్పకుండా పెంచుతుందని, దీంతో యూఎస్ బాండ్లకు డిమాండ్ పెరిగి బులియన్ మార్కెట్ కుదేలవుతుందని షిన్హువా అభిప్రాయపడింది. మరోవైపు గడచిన మూడు సెషన్లలో బంగారం ధరలు పడిపోవడం వినియోగదారుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన యూఎస్ నిరుద్యోగ నివేదిక ప్రకారం, అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. ఇది బంగారం ధరల క్షీణతకు దారితీస్తుంది. బాండ్లపై వడ్డీలు పెరిగితే, డాలర్ విలువ బలపడుతుందని, దీని ఫలితంగా గోల్డ్ రేటు తగ్గుతుందని నిపుణుల అంచనా. అయితే, ఇదే సమయంలో డాలర్ విలువ పెరిగితే, రూపాయి విలువ తగ్గినట్టే కాబట్టి, బంగారం ధరల తగ్గుదల ప్రయోజనం ఇండియాలో ఎంతవరకూ ప్రజల దరికి చేరుతుందన్న ప్రశ్నా ఉదయిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గి, అదే స్థాయిలో ఇండియాలో ధరలు తగ్గకుంటే, స్మగ్లింగ్ మరింతగా పెరుగుతుంది. అదే జరిగితే బంగారంపై దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా ధరలను అదుపులో ఉంచే ప్రయత్నాలను కేంద్రం చేపట్టవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనా, సమీప భవిష్యత్తులో బంగారం ధరల కదలికపై ఆసక్తి నెలకొందనడంలో సందేహం లేదు.

More Telugu News