: కేంద్రం ఒత్తిడికి తలొగ్గనున్న ఆర్బీఐ చీఫ్!

మోదీ సర్కారులోని మంత్రులు, పారిశ్రామికవేత్తల నుంచి వడ్డీ రేట్ల తగ్గింపునకు వస్తున్న ఒత్తిడి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పై పనిచేసేలా కనిపిస్తోంది. చైనాలో ఆర్థిక మాంద్యం ఏర్పడి వృద్ధి నిదానించిన వేళ, దాన్ని ఇండియాకు లాభంగా మార్చాలంటే, వడ్డీ రేట్లు తగ్గించాల్సిందేనని ఆర్థిక నిపుణులు ఇస్తున్న సలహాల మేరకు ఎల్లుండి జరగనున్న పరపతి సమీక్షలో 0.25 నుంచి 0.5 శాతం వరకూ రెపో రేటును తగ్గిస్తూ, రాజన్ తన నిర్ణయాన్ని వెలువరించవచ్చని తెలుస్తోంది. ద్రవ్యోల్బణం తగ్గడం, యూఎస్ వడ్డీ రేట్లు పెంచకపోవడంతో ఇండియాలో వడ్డీ రేట్లు తగ్గించడానికి మార్గం సుగమమైందని బ్యాంకర్లు వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం వడ్డీ రేట్లపై స్పందిస్తూ, "కనీస ఇంగితజ్ఞానమున్న ఎవరైనా వడ్డీలు తగ్గుతాయనే అంటారు" అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సమీప భవిష్యత్తులో కూరగాయలు, నిత్యావసర వస్తు ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డ ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, వడ్డీ రేటు తగ్గవచ్చని అంచనా వేశారు. పావు శాతం వరకూ రెపో రేటు తగ్గుతుందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుణ్ తివారీ వ్యాఖ్యానించగా, ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్ లు మాత్రం మారకపోవచ్చని హెచ్ఎస్బీసీ ఇండియా హెడ్ నైనా లాల్ కిద్వాయ్ అభిప్రాయపడ్డారు. సూక్ష్మ స్థాయిలో బిజినెస్ సెంటిమెంట్ మెరుగుపడటంతో ఈ దఫా రెపో రేటులో కోతను చూడవచ్చని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ కే గుప్తా వివరించారు.

More Telugu News