: ట్రక్కులో పెద్ద సంఖ్యలో శవాలు... వలసవాదులవా?

ఆస్ట్రియాలోని ఓ రహదారిపై ట్రక్కులో పదుల సంఖ్యలో శవాలను గుర్తించారు. హంగేరీ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఈ ట్రక్కు ఉన్నట్టు ఆస్ట్రియా పోలీసు విభాగం అధికార మీడియా ప్రతినిధి తెలిపారు. శవాలు బాగా కుళ్లిన స్థితిలో ఉన్నాయని, దాంతో, అవయవాలు తేలిగ్గా విడవడిపోతున్నాయని చెప్పారు. ఈ కారణంగా, శవాలు ఎన్ని? అన్న దానిపై స్పష్టత రాలేదని పేర్కొన్నారు. 50కి పైగా మృతదేహాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. వీరందరినీ వలసవాదులుగా భావిస్తున్నారు. వీరిని మరో ప్రాంతానికి అక్రమంగానో, బలవంతంగానో తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ట్రక్ పై స్లొవేకియా పౌల్ట్రీ ఉత్పత్తుల కంపెనీ 'హైజా' లోగో ఉంది. నెంబర్ ప్లేట్ మాత్రం హంగేరీ రిజిస్ట్రేషన్ తో ఉంది. అయితే, ఆ వాహనం తమది కాదని 'హైజా' ప్రకటించింది. దాన్ని వేరే వ్యక్తులకు విక్రయించామని, అయితే వారు ఆ లోగోను తొలగించలేదని పేర్కొంది. కాగా, ఈ వాహనం హంగేరీ నుంచి ఆస్ట్రియాలో ప్రవేశించేటప్పటికే వారందరూ మరణించి ఉంటారని ఆస్ట్రియా పోలీసు విభాగం పేర్కొంది. అయితే, వారు ఎలా చనిపోయారన్నది మిస్టరీగా మారింది. ఆ ట్రక్కును నికెల్స్ డార్ఫ్ తరలించారు. అక్కడ శవాలకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ ట్రక్కు డ్రైవర్ కోసం ఆస్ట్రియా, హంగేరీ పోలీసు బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.

More Telugu News