: చిల్లీ గ్రెనేడ్లతో ఆ టెర్రరిస్టు బెంబేలెత్తిపోయాడు!

జమ్మూకాశ్మీర్లో మరో ఉగ్రవాది పట్టుబడడం తెలిసిందే. ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా ప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో పలువురు టెర్రరిస్టుల హతం కాగా, సజ్జాద్ అహ్మద్ అనే ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత్ లో ప్రవేశించిన ఈ లష్కరే తోయిబా మిలిటెంట్లు భారత బలగాల కూంబింగ్ నుంచి తప్పించుకునేందుకు రఫియాబాద్ సమీపంలోని ఓ గుహలో దాగారు. వారిని గుర్తించిన భారత బలగాలు కాల్పులతో విరుచుకుపడ్డాయి. దాంతో, ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. గుహలో మరికొందరు టెర్రరిస్టులు ఉన్నారేమో అని భావించిన భద్రతా దళాలు చిల్లీ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయి. కాసేపటి తర్వాత భద్రతా దళాలు ఆ గుహలో ప్రవేశించగా, అక్కడో వ్యక్తి భయంతో వణికిపోతూ, ఏడుస్తూ కనిపించాడు. చిల్లీ గ్రెనేడ్లలోని మిరప ఘాటు కారణంగా ఉక్కిరిబిక్కిరైన అతడిని అదుపులోకి తీసుకున్నారు. భారత సైన్యం, పారా మిలిటరీ దళాలు కొంతకాలంగా స్పెషల్ ఆపరేషన్లలో చిల్లీ గ్రెనేడ్లను ఉపయోగిస్తున్నాయి. ఈ చిల్లీ గ్రెనేడ్ల తయారీలో ప్రపంచంలో అత్యంత ఘాటైన భూత్ జోలోకియా మిరపకాయలను ప్రధాన పదార్థంగా ఉపయోగిస్తారు. వీటిని ప్రయోగిస్తే, వాటి ఘాటుకు ఎవరైనా ఉక్కిరిబిక్కిరైపోవాల్సిందే.

More Telugu News