: ఆఫీసుల్లో డేటింగ్ తో ప్రమోషన్లు దూరం!

ఆఫీసుల్లో తాము జరుపుతున్న ప్రేమాయణాలు తమకు ప్రమోషన్లను దూరం చేస్తున్నాయని అంటున్నారు ఉద్యోగులు. అయినా, డేటింగ్‌ అవకాశం వస్తే వదిలేది లేదని అత్యధికులు కుండ బద్దలు కొట్టినట్టు చెపుతుండడం గమనార్హం. భవిష్యత్‌ జీవితం కోసం ప్రస్తుతానికి అటువంటివి పక్కన పెడితేనే మంచిదన్న అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నవారు కొద్ది మంది మాత్రమే. ఇటీవలి కాలంలో కార్పొరేట్‌ కార్యాలయాల్లో డేటింగ్ సహజమైపోయింది. రొమాన్స్‌ విషయం బయటకు పొక్కి గొడవలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో మహిళా ఉద్యోగినుల వాదన మరోలా ఉంది. తమపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తోందని, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల కోసం తప్పడం లేదని వారు వాపోతున్నారు. సహచర ఉద్యోగులతో డేటింగ్‌ చేస్తే రావాల్సిన ప్రమోషన్లు దూరమవుతున్నాయని 60 శాతం మంది ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్‌ కంపెనీల్లో డేటింగ్‌పై కెరీర్ బిల్డర్ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. కార్పొరేట్ ఆఫీసుల్లో 40 శాతం మంది ఉద్యోగులు సహచరులతో రొమాంటిక్ రిలేషన్ షిప్ ను కొనసాగిస్తుండగా, అందులో 31 శాతం వరకూ పెళ్లిపీటలెక్కుతున్నారు. డేటింగ్ లో బ్రేకప్ తరువాత ఉద్యోగాన్ని వదిలేసుకున్నామని 7 శాతం మంది తెలిపారు. కనీసం ఒక్కసారన్నా డేటింగ్‌కు వెళ్లిన మహిళా ఉద్యోగుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సి వస్తోందని 60 శాతం మంది, తమ ఇష్టపూర్వకంగానే డేటింగ్‌కు వెళ్లామని 40 శాతం మంది ఇదే తరహాలో జరిగిన మరో సర్వేలో తెలిపారు. తమ బాస్‌తో దగ్గరి సంబంధాలు కలిగివున్నామని 10 శాతం మంది వెల్లడించారు. కాగా, పలు కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న వారి 'కోడ్ ఆఫ్ కాండక్ట్'పై పలు నిబంధనలు విధిస్తున్నాయి. సహోద్యోగులతో ఎలా మెలగాలన్న విషయమై ప్రత్యేక క్లాసులూ తీసుకుంటున్నాయి. డేటింగ్ ను సాధ్యమైనంతగా తగ్గించాలన్న ఉద్దేశంతో కార్పొరేట్‌ యాజమాన్యాలు సాధ్యమైనన్ని చర్యలు తీసుకుంటూనే వున్నాయట. ఎక్కడికక్కడ కెమెరాలు ఏర్పాటు చేయడం వీటిల్లో ముఖ్యమైన అంశం. అయినా... రొమాన్స్‌ కావాలని కోరుకునేవారిని ఈ కెమెరాలు ఆపుతాయా?

More Telugu News