: 50 వేల మందిలో ఒకరికి సోకే వ్యాధి...పసివాడి ప్రాణంతో ఆడుకుంటోంది

భారత సంతతికి చెందిన పసివాడికి ఎంత కష్టం వచ్చింది! 50 వేల మందిలో ఒకరికి సోకే అరుదైన వ్యాధి ఆ పసివాడి ప్రాణాలతో ఆడుకుంటోంది. 'ఎపిడెర్మోలిసిస్ బులోసా' అనే వ్యాధి 50 వేల మందిలో ఒకరికి జన్యుపరమైన లోపాల కారణంగా సోకుతుంది. ఈ వ్యాధి సోకిన వారి చర్మం అత్యంత మృదువుగా ఉంటుంది. వారి శరీరాన్ని ఎవరు ముట్టుకున్నా, లేదా వారే ముట్టుకున్నా అక్కడ చర్మం ఊడిపోతుంది. ఇప్పుడీ వ్యాధి సౌతాఫ్రికాలో నివాసముంటున్న భారత సంతతి రెండు నెలల బాలుడికి సోకింది. నజ్మీరా, అర్షద్ అక్బర్ అనే భారత సంతతి దంపతులకు అబూబకర్ అనే బాలుడు జన్మించాడు. పుట్టుకతోనే అబూబకర్ మృదువైన పొరతో జన్మించాడని, అతనిని ఎత్తుకోవాలన్నా చేతుల్లో మెత్తటి దిండు లేదా వస్త్రం పెట్టుకుని ఎత్తుకోవాల్సి వస్తోందని బాలుడి తల్లి నజ్మీరా తెలిపారు. పొరపాటున అబూబకర్ చేయి అతని శరీరంలో ఏ ప్రాంతానికి తగిలినా అక్కడి చర్మం ఊడిపోతుందని వారు వెల్లడించారు. దీంతో బాలుడి చేతికి మెత్తని, పొడవైన గ్లోవ్స్ తగిలించినట్టు ఆ దంపతులు తెలిపారు. అయితే తనకు ఓ సోదరుడు ఇదే వ్యాధితో జన్మించాడని, ఆరువారాల తరువాత మరణించాడని తన తల్లి చెప్పేదని అబూబకర్ తల్లి నజ్మీరా తెలిపారు. ఈ వ్యాధి వల్ల ఒక్కోసారి పిల్లల ప్రాణాలు పోతాయని, అత్యంత జాగ్రత్తగా చూసుకుంటే బాలుడి ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని డెర్మటాలజీ ప్రొఫెసర్ జమీలా అబూబకర్ తెలిపారు.

More Telugu News