: రోతపుట్టిస్తున్న 'చెట్టినాడ్ గ్రూప్' తండ్రీ కొడుకుల యుద్ధం

సిమెంటు నుంచి విద్య వరకూ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న చెట్టినాడ్ గ్రూపులో నెలకొన్న ఆధిపత్య పోరు సంస్థ పరువు తీస్తోంది. చెట్టినాడ్ మాజీ చైర్మన్ ఎంఏఎం రామస్వామి, ఆయన దత్త పుత్రుడు ఎంఏఎంఆర్ ముత్తయ్య అలియాస్ అయ్యప్పన్ ల మధ్య నెలకొన్న పోరు తీవ్రరూపం దాల్చింది. తాజాగా కొన్ని కీలక పత్రాల కోసం ముత్తయ్య నేతృత్వంలో 30 నుంచి 40 మంది దుండగులు చెన్నైలోని చెట్టినాడ్ హౌస్ పై దాడి చేసి అక్కడ వీరంగం సృష్టించారు. తన ప్రాణాలకు ముప్పుందని, తనకు మిగిలిన అతికొద్ది ఆస్తులనూ కాజేయాలని చూస్తున్నారని రామస్వామి ఆరోపిస్తున్నారు. చెట్టినాడ్ హౌస్ పై దాడి వెనుక ముత్తయ్య ఉన్నాడని ఆరోపించారు. ఇప్పటికే తనకు చెందిన 90 శాతం ఆస్తులను తీసేసుకున్నారని ఆయన వాపోయారు. మిగిలిన రూ. 60 నుంచి 70 కోట్ల విలువైన ఆస్తులను కాపాడుకునేందుకు ఓ ట్రస్టును ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. కాగా, ఈ ఆరోపణలను ముత్తయ్య తరపు న్యాయవాది మురళి కొట్టి పారేశారు. అదే ఇంట్లో మరోవైపున ఉంటున్న తన క్లయింటుపైనే దాడి జరిగిందని ఆయన తెలిపారు. ఆయన గత రాత్రే సింగపూర్ నుంచి వచ్చారని తెలిపారు. చెట్టినాడ్ గ్రూప్ లో నెలకొన్న పరిణామాలు రోతపుట్టిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News