: పాము విషంతో ఎయిడ్స్ కు మందు... కీలక దశలో ఐఐసీటీ శాస్త్రవేత్తల పరిశోధనలు

ఎయిడ్స్ వ్యాధి నివారణకు మందు తయారవుతోంది. ఈ మందు ఒక్క ఎయిడ్స్ నే కాదండోయ్... ఎబోలా, హెపటైటిస్-బి తదితర ప్రాణాంతక వ్యాధులను కూడా తరిమికొడుతుందట. ఇంతటి కీలక ఔషధాన్ని రూపొందిస్తోంది ఎవరో తెలుసా... మన హైదరాబాదీలే! నగరంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), ప్రభుత్వం హోమియో వైద్య కళాశాల నిపుణులు సంయుక్తంగా ఈ మందును తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఔషధంపై జరుగుతున్న పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. అసలు ఈ మందు దేనితో తయారు చేస్తున్నారో తెలుసా... పాము విషంతో! అది కూడా అత్యంత విషపూరితమైన సర్పంగా పేరుగాంచిన రక్త పింజర (క్రొటాలస్ హెరిడస్) విషం నుంచి ఈ ఔషధాన్ని తయారుచేస్తున్నట్లు ఐఐసీటీ శాస్త్రవేత్త మెయింకర్, హోమియో వైద్య నిపుణుడు ప్రవీణ్ కుమార్ లు పేర్కొన్నారు. రక్త పింజర విషం ఆర్టీ ఆనే ఎంజైమ్ ను నిరోధించగలదని వీరు ఇప్పటికే శాస్త్రీయంగా నిరూపించారు. రక్త పింజర విషానికి హెఐవీ వైరస్ కణాల విభజనను అడ్డుకునే శక్తి ఉన్నట్లు వీరు చెబుతున్నారు. ప్రస్తుతం తమ పరిశోధనలు కీలక దశలో ఉన్నాయని చెప్పిన వీరు, త్వరలోనే ఈ మందును అందుబాటులోకి తీసుకువస్తామని ధీమాగా చెబుతున్నారు.

More Telugu News