: అంత ఈజీ కాదు... ఇండియాతో వాణిజ్యానికి ఇంకా ఎన్నో అడ్డంకులు: మనసులో మాట చెప్పిన ఒబామా

ఇండియా, అమెరికాల మధ్య అనుకున్న వాణిజ్య లక్ష్యాలను చేరడం అంత సులభంకాదని బరాక్ ఒబామా అభిప్రాయ పడ్డారు. భారత్ తో వ్యాపారానికి ఇంకా ఎన్నో అడ్డంకులు వున్నాయని, వీటిని అధిగమించేందుకు మరింతగా కృషి చేయాలని తన మనసులోని మాటను ఆయన బయట పెట్టారు. నిన్న రాత్రి జరిగిన వ్యాపారవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. "అమెరికా దిగుమతుల్లో ఇండియా వాటా కేవలం 2 శాతమే. ఇక ఎగుమతుల్లో భారత్ కు వస్తున్నది ఒక్క శాతం మాత్రమే. 100 కోట్లకు పైగా జనాభా ఉన్నా, అవకాశాలు అందిపుచ్చుకోవడంలో మాత్రం ఇరు దేశాలూ ఇంకా ఎంతో చేయాలి. ఇండియాతో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.3 లక్షల కోట్లు) వాణిజ్యాన్ని నమోదు చేయగా, చైనాతో 560 బిలియన్ డాలర్ల (సుమారు 48 లక్షల కోట్లు) వాణిజ్యాన్ని అమెరికా నమోదు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇండియాతో వాణిజ్య బంధాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం తరపున 4 బిలియన్ డాలర్లు (సుమారు 25 వేల కోట్లు) పెట్టుబడులుగా, రుణాలుగా ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. ఈ నిధుల్లో రూ.6,300 కోట్లను చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, మరో రూ.12,500 కోట్లను ప్రత్యామ్నాయ ఇంధన రంగానికి అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.

More Telugu News