Mathu Vadalara 2: మత్తువదలరా-2 సినిమాకు అదిరిపోయే ప్రశంస ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi praises Mathu Vadalara 2 Movie after watching

  • ఈ మధ్య కాలంలో చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా కనపడలేదన్న దిగ్గజ నటుడు
  • ఎండ్ టైటిల్స్ వరకు చూశానని వెల్లడి
  • సినిమా నటీనటులు అందరినీ ప్రశంసించిన మెగాస్టార్

సెప్టెంబర్ 13న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మత్తువదలరా-2 సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నవ్వుల పువ్వులు పూయిస్తోన్న ఈ సినిమాపై అగ్ర తారలు సైతం ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో పాటు పలువురు ప్రశంసించగా ఈ జాబితాలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు.

ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా తనకు కనపడలేదని ఆయన అభినందించారు. ఎండ్ టైటిల్స్‌ని కూడా వదలకుండా చూశానని ఆయన చెప్పారు. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు రితేష్ రాణాకి ఇవ్వాలని మెచ్చుకున్నారు. ‘‘దర్శకుడి రాత , తీత , కోత , మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా ఉండలేము. హ్యాట్సాఫ్ రితేష్ రాణా!’’ అని చిరంజీవి పేర్కొన్నారు. నటీ నటులు సింహ కోడూరి, ప్రత్యేకించి సత్యకి తన అభినందనలు అని ఆయన తెలిపారు. అలాగే ఫరియా అబ్దుల్లా, కాలభైరవలకు, మంచి విజయాన్ని అందుకున్న మైత్రీ మూవీస్ సంస్థకు, టీమ్ అందరికీ అభినందనలు అని ఆయన మెచ్చుకున్నారు. నిన్ననే 'మత్తు వదలరా - 2' చూశానంటూ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. వినోదం 100 శాతం గ్యారంటీ అని వ్యాఖ్యానించారు.

కాగా సింహా కథానాయకుడిగా 2019లో వచ్చిన 'మత్తువదలరా' సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. వెన్నెల కిశోర్, సత్య, ఫరియా అబ్దుల్లా, అజయ్, రోహిణి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. రితేశ్ రాణా దర్శకత్వం వహించగా పెదమల్లు చిరంజీవి-హేమలత నిర్మాతలుగా ఉన్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించారు.

Mathu Vadalara 2
Chiranjeevi
Movie News
Tollywood
  • Loading...

More Telugu News