Visaka Steel Plant: నేడు ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కీలక భేటీ ..విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై సర్వత్రా ఉత్కంఠ

vizag steel plant cmd atul bhatt was removed by the government
  • విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కీలక పరిణామం
  • స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ విధుల నుండి తొలగింపు
  • రిటైర్ మెంట్ వరకూ సెలవుపై వెళ్లాలని ఆదేశాలు
  • ప్రైవేటీకరణపై అడుగులంటూ కార్మికుల్లో అనుమానాలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి ఢిల్లీలో ఈరోజు (మంగళవారం) కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఈ తరుణంలో ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ లో కీలక పరిణామాలు చోటుచేసుకోవడంతో సమావేశంలో ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన కేంద్ర ఉక్కు మంత్రి కుమార స్వామి .. 45 రోజుల్లో అన్నీ చక్కదిద్దుకుంటాయని, ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని కార్మికులకు భరోసా ఇచ్చారు. 

అయితే స్టీల్ ప్లాంట్ సీఎండీగా ఉన్న అతుల్ భట్ ను అర్ధాంతరంగా విధులను తప్పించి, రిటైర్ మెంట్ వరకూ సెలవుపై వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదని చెబుతూనే కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా ప్లాంట్ లో ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే ప్రయత్నాలు మొదలవడంతో ప్రైవేటీకరణకు అనుగుణంగా ఒక్కో నిర్ణయం జరుగుతుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. 19వేల పైచిలుకు ఉన్న స్టీల్ ప్లాంట్ కార్మికుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 8వేలకు దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే 2025 నాటికి 2500 మందికి వీఆర్ఎస్ పేరుతో ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైందన్న చర్చ కార్మికవర్గాల్లో నడుస్తోంది. ఇందుకోసం రూ.1260కోట్లు సిద్దం చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. నాగర్‌నార్ స్టీల్ ప్లాంట్ లో సాంకేతికంగా అనుభవజ్ఞులైన కార్మికులు లేరని విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి కార్మికులను పంపించాలని కేంద్రం కోరిన వెంటనే 500 మందిని విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం డిప్యుటేషన్‌పై పంపించి వేయాలని నిర్ణయించడం చూస్తే కార్మికుల్లో అనుమానాలకు బలం చేకూరుతోంది.
Visaka Steel Plant
Vizag Steel Plant
CMD
ap news

More Telugu News