Rohit Sharma: కోహ్లీ, రోహిత్ శర్మలకు పాకిస్థాన్ మాజీ స్టార్ ఆటగాడి కీలక విజ్ఞప్తి

Rohit and Virat to visit Pakistan once before retiring says Pakistan former player Kamran Akmal
  • రిటైర్మెంట్‌కు ముందు ఇద్దరూ ఒకసారి పాక్‌లో ఆడాలన్న కమ్రాన్ అక్మల్
  • విరాట్, రోహిత్‌లకు పాక్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్న మాజీ క్రికెటర్
  • కోహ్లీ అందరికీ ఆదర్శవంతమైన క్రికెటర్ అని కొనియాడిన పాక్ మాజీ వికెట్ కీపర్
ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎక్కడికి వెళ్లినా విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఏ దేశానికి వెళ్లి ఆడినా వీరిద్దరికీ ఫ్యాన్స్ మద్దతు ఇస్తుంటారు. అయితే క్రికెట్ ఆడే ప్రధాన దేశాల్లో ఒకటైన పాకిస్థాన్‌లో వీరిద్దరూ ఒక్కసారి కూడా పర్యటించలేదు. 2012-13లో పాకిస్థాన్ చివరిసారిగా భారత్‌లో పర్యటించింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. ఇక భారత్ 2006లో చివరిసారిగా పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లింది. అప్పటికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. దీంతో వీరిద్దరు స్టార్ క్రికెటర్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాకిస్థాన్‌లో ఆడలేదు.

ఇక ఛాంపియన్స్ ట్రోఫీ-2025‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా భారత జట్టు పాల్గొనడంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతా లేదు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ స్టార్ ఆటగాడు కమ్రాన్ అక్మల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్ అయ్యే ముందు రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీలు ఒకసారి పాకిస్థాన్‌ సందర్శనకు రావాలని కోరాడు. పాకిస్థాన్‌లో వీరిద్దరికి లభించే ప్రేమ, అభిమానాలు అన్నింటినీ మించిపోతాయని అక్మల్ వ్యాఖ్యానించాడు.

ప్రపంచ క్రికెట్‌లో వీరిద్దరూ స్టార్‌ ఆటగాళ్లని, క్రికెట్ ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పర్యటిస్తున్నారని అక్మల్ అన్నాడు. ‘‘ప్రతి క్రికెట్ ఫ్యాన్ వారిని అభిమానిస్తుంటారు. వారి అద్భుతమైన బ్యాటింగ్, మ్యాచ్‌లను గెలిపించే ప్రదర్శనల కారణంగా ఇద్దరికీ పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. పాకిస్థాన్‌లో వారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మిగతా అన్ని చోట్లా చూసిన దానిని మించిపోతుంది’’ అని అక్మల్ వ్యాఖ్యానించాడు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు కోహ్లీ ఒక ఆదర్శవంతమైన క్రికెటర్ అని, పాకిస్థాన్‌లో అతడికి అపూర్వమైన ఆదరణ లభిస్తుందని అక్మల్ పేర్కొన్నాడు. ‘‘ప్రపంచంలో చాలా మందికి విరాట్ కోహ్లీ రోల్ మోడల్. రోహిత్ శర్మప్రపంచ కప్ గెలిచిన జట్టు కెప్టెన్. జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్. ఈ ఆటగాళ్లు పాకిస్థాన్‌లో పర్యటిస్తే ఇక్కడ అందరికీ ప్రత్యేకంగా ఉంటుంది. విరాట్ అండర్-19 రోజులలో పాక్‌కు వచ్చాడు. కానీ అప్పుడు అతడికి అంత ఆదరణ లేదు’’ అని అక్మల్ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లీ అండర్-19 క్రికెట్ ఆడుతున్న రోజుల్లో పాకిస్థాన్‌లో పర్యటించాడు. అయితే అప్పటికి కోహ్లీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.
Rohit Sharma
Virat Kohli
Pakistan
Kamran Akmal
Cricket

More Telugu News