Smriti Mandhana: మ‌రోసారి బిగ్ బాష్‌ లీగ్‌లోకి స్మృతి మంధాన

Smriti Mandhana Signs For Adelaide Strikers Ahead of WBBL 10

  • అడిలైడ్ స్ట్రైకర్స్‌తో భార‌త స్టార్ ఓపెనర్ ఒప్పందం 
  • గతంలో బ్రిస్బేన్ హీట్, హోబర్ట్ హరికేన్స్, సిడ్నీ థండర్ జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం
  • డ‌బ్ల్యూబీబీఎల్‌ డ్రాఫ్ట్ కోసం నామినేషన్‌లలో హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ

మహిళల భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మహిళల బిగ్ బాష్ లీగ్ ( డ‌బ్ల్యూబీబీఎల్‌) రాబోయే 10వ ఎడిషన్ కోసం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో ఒప్పందం చేసుకుంది. కాగా, గతంలో ఆమె ఇదే లీగ్‌లో బ్రిస్బేన్ హీట్, హోబర్ట్ హరికేన్స్, సిడ్నీ థండర్ జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వహించింది. 

ఇక ఎడ‌మ‌చేతి వాటం బ్యాట‌ర్ అయిన మంధాన ఇప్ప‌టికే మ‌హిళా క్రికెట్‌లో త‌న‌దైన అద్భుత‌మైన ఆట‌తీరుతో ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకుంది. తాజా ఒప్పందంతో ఆమె డ‌బ్ల్యూబీబీఎల్‌ ప్రీ-డ్రాఫ్ట్ ఓవర్సీస్ కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన మొదటి భారతీయురాలిగా నిలిచింది. 

స్మృతి మంధాన టీ20 క్రికెట్ కెరీర్ ఇలా.. 
ఈ స్టైలిష్ ఓపెనర్ ఖాతాలో రెండు ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఘనత ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లీస్ పెర్రీకి మాత్రమే ఉంది. ఇక అంత‌ర్జాతీయ టీ20ల్లో ఆమె భార‌త్ తరఫున‌ 28.86 సగటు, 122.51 స్ట్రైక్ రేట్‌తో 3,493 పరుగులు చేసింది. ఇందులో 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

ఈ ఏడాది ప్రారంభంలో మంధాన.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జ‌ట్టుకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ అందించిన విష‌యం తెలిసిందే. ఆమె కెప్టెన్సీ, కోచ్ ల్యూక్ విలియమ్స్ మార్గదర్శకత్వంలో ఆర్‌సీబీ టోర్నీ విజేత‌గా అవ‌త‌రించింది. 

కాగా, మంధానతో పాటు టీమిండియాకు చెందిన హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు సెప్టెంబర్ 1న జరగబోయే డ‌బ్ల్యూబీబీఎల్‌ డ్రాఫ్ట్ కోసం నామినేషన్‌లలో ఉన్నారు.

డ‌బ్ల్యూబీబీఎల్ 10వ‌ సీజన్ అక్టోబర్ 27న ప్రారంభమవుతుంది. అడిలైడ్ ఓవల్ వేదిక‌గా జ‌రిగే మొద‌టి మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ తో బ్రిస్బేన్ హీట్ త‌ల‌ప‌డ‌నుంది. ఇదిలాఉంటే.. స్మృతి మంధానను త‌మ జ‌ట్టులోకి ఆహ్వానిస్తూ అడిలైడ్ స్ట్రైకర్స్ ప్ర‌త్యేక ట్వీట్ చేసింది. 'రాబోయే డ‌బ్ల్యూబీబీఎల్‌ 10వ ఎడిషన్ కోసం మాతో చేరుతున్న ఇండియ‌న్ సూప‌ర్ స్టార్‌కు వెల్‌కం' అంటూ పోస్ట్ చేసింది.

Smriti Mandhana
WBBL
Adelaide Strikers
Cricket
Sports News
  • Loading...

More Telugu News