Union Budget 2024: 'ప్రత్యేక హోదా' డిమాండ్ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌పై బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందన

amid special status demands for Bihar state CM Nitish Kumar reacts to Union Budget 2024


బీహార్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని ఎన్డీయే భాగస్వామ్య పక్ష పార్టీ అయిన జేడీయూ బడ్జెట్ ముందు నుంచీ డిమాండ్ చేస్తోంది. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (మంగళవారం) ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో ఈ మేరకు ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే ఆ రాష్ట్రానికి రూ.26 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కేంద్రం ప్రకటించింది. దీంతో బడ్జెట్‌పై స్పందించిన బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తాను నిరంతరం ప్రత్యేక హోదాను కోరుతూనే ఉన్నానని, ప్ర‌త్యేక హోదా లేదా ప్ర‌త్యేక ప్యాకేజ్ ఏదో ఒకటి ఇవ్వాలని ఎన్‌డీఏ పెద్దలను అడిగానని సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. తాను అడిగినందునే చాలా విషయాల్లో సాయం ప్ర‌క‌టించారని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్ర‌త్యేక హోదా గురించి తాము మాట్లాడుతూనే ఉన్నప్పటికీ ఇందుకు సంబంధించిన నిబంధనలకు గతంలోనే ముగింపు పలికామని చెబుతున్నారని, కాబట్టి బీహార్‌కు ప్రత్యేక సాయం అందించాల్సి ఉందని, అది మొదలైందని ఆయన అన్నారు. 

ఇక బడ్జెట్‌ పట్ల సంతృప్తిగా ఉన్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ప్రత్యేక హోదా అయినా.. ప్రత్యేక ప్యాకేజీ అయినా ఏదో ఒకటి కావాలని డిమాండ్ చేసింది తామేనని వ్యాఖ్యానించారు. కాగా ఎన్డీయే భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జేడీయూ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేసిన విషయం తెలిసిందే. బీహార్‌లో రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.26,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది. అంతేకాకుండా పలు ప్రాజెక్టులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

Union Budget 2024
Nitish Kumar
Bihar
NDA
JDU
  • Loading...

More Telugu News