Muchumarri: పోలీస్ స్టేషన్‌లో ముచ్చుమర్రి నిందితుడి అనుమానాస్పద మృతి.. లాకప్‌డెత్‌పై అనుమానాలు

Muchumarri girl missing case accused died in police station
  • బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో హుస్సేన్‌ది కీలక పాత్ర అని పోలీసుల అనుమానం
  • రెండ్రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారణ
  • నిన్న విచారిస్తుండగా గుండెపోటుకు గురికావడంతో ఆసుపత్రికి తరలింపు
  • మృతదేహంపై గాయాలున్న వీడియో వెలుగులోకి
  • విచారణలో పాల్గొన్న సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుల్, హోంగార్డుపై అనుమానాలు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక (9) హత్యకేసు నిందితుడు హుస్సేన్ (29) పోలీసు విచారణలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, ఆపై హత్య చేసిన ముగ్గురు బాలురు, మృతదేహాన్ని మాయం చేయడంలో సహకరించిన ఓ బాలుడి తండ్రి, పెదనాన్నను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

మరో బాలుడి మేనమామ హస్సేన్ కూడా బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో కీలక పాత్ర పోషించాడని అనుమానించిన పోలీసులు విచారణ కోసం రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. నిన్న నంద్యాల సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తుండగా గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో వెంటనే అతడిని నంద్యాలలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. 

ఎస్పీ వివరణ ఇలా
పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అనారోగ్య సమస్యతోనే హుస్సేన్ మృతి చెందినట్టు ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా తెలిపారు. నంద్యాల శివారులోని మసీదుపురం మెట్టనుంచి నందికొట్కూరుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో తలముడిపి సమీపంలో పోలీసు జీపు నుంచి హుస్సేన్ కిందికి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడని, అప్రమత్తమైన పోలీసులు వెంటాడి పట్టుకున్నట్టు తెలిపారు.

ఈ క్రమంలో హుస్సేన్ ఆయాస పడుతూ చాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే అతడిని నంద్యాల ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. ఆయన మృతికి మిడుతూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయించినట్టు పేర్కొన్నారు. హుస్సేన్ కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు మేజిస్ట్రేట్ ముందు ఆయన బంధువులు తెలిపినట్టు పేర్కొన్నారు.

లాకప్‌డెత్‌పై అనుమానాలు
మృతుడి శరీరంపై గాయాలు ఉన్నట్టు వీడియో ఒకటి వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. దీంతో హుస్సేన్‌ది లాకప్‌ డెత్ అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుస్సేన్‌ను విచారించిన ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, ఓ కానిస్టేబుల్, హోంగార్డుపై ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
Muchumarri
Girl Missing Case
Nandyal
Lockup Death

More Telugu News