Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy delh tour today to meet Rahul Gandhi central ministers

  • ఆదివారం రాత్రి లేదా సోమవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ
  • వరంగల్‌లో నిర్వహించనున్న భారీ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్న సీఎం
  • మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నియామకాలపైనా సంప్రదింపులు జరిపే అవకాశం
  • కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులు కోరనున్న రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం మధ్యాహ్నానికి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అవుతారు. 

ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ అమలును సీఎం రేవంత్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని పురస్కరించుకుని వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని రేవంత్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీని రేవంత్ ఆహ్వానించనున్నారు. 

మరోవైపు, పార్లమెంటు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏకకాలంలో జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వెసులుబాటును బట్టి బహిరంగ సభ తేదీని నిర్ణయించనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్.. ఇతర కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నియామకాలపైనా సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులు కోరనున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 

ఇక తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశం కానుంది. ఇందుకు సంబంధించి గవర్నర్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం, అసెంబ్లీ సమావేశాల తొలి రోజున దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం తెలిపే కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత  2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు సహా అన్ని పథకాలను పరిగణనలోకి తీసుకుని రూ.2.90 లక్షల  బడ్జెట్‌ను రూపొందించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఏప్రిల్ నుంచి జులై వరకూ నాలుగు నెలల కోసం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెల 31తో ముగియనుండటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు శాఖల వారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే సమీక్షించారు. ఆయా శాఖలు తమ ప్రాధమ్యాలను వివరించగా.. ప్రభుత్వం కూడా బడ్జెట్‌పై ఒక అంచనాకు వచ్చింది. 

Revanth Reddy
Rahul Gandhi
New Delhi
Congress
  • Loading...

More Telugu News