PFAS: తాగునీటి కాలుష్యం.. వృషణాల క్యాన్సర్ బారినపడ్డ యువకుడు

Contaminated Drinking Water Gave Man Testicular Cancer Lawsuit Says
  • అమెరికాలో వెలుగు చూసిన ఘటన 
  • హానికారక పీఎఫ్ఏఎస్‌లను పలు కంపెనీలు వినియోగిస్తున్నాయన్న బాధితుడు
  • పీఎఫ్ఏఎస్‌ కలుషితమైన నీరు తాగినందుకు వృషణాల క్యాన్సర్ వచ్చిందని కేసు
  • ఈ రసాయనాల చెడు ప్రభావంపై తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆవేదన
  • తమ నష్టానికి పరిహారం చెల్లించాలంటూ బాధితుడు, అతడి భార్య కేసు
హానికారక రసాయనాలతో కలుషితమైన నీరు తాగి వృషణాల క్యాన్సర్ బారినపడ్డానంటూ అమెరికాలోని ఓహియో రాష్ట్రం ఏంగిలే ఉడ్ నగరానికి చెందిన ఓ యువకుడు (29) కోర్టులో కేసు దాఖలు చేశాడు. నీటి కాలుష్యానికి కారణమైన కెమికల్ కంపెనీలను కోర్చుకీడ్చాడు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం, పాలీఫ్లోరోఆల్కైల్ రసాయనాలను (పీఎఫ్ఏఎస్) వాడే రెండు డజన్లకు పైగా కంపెనీల కారణంగా తన తాగునీరు కలుషితమైందని ఆరాన్ అడ్కిన్స్ ఆరోపించాడు. 3ఎమ్, డూపాంట్ సంస్థలే దీనికి ప్రధానకారణమని పేర్కొన్నారు. 

సాధారణంగా మంటలను ఆర్పేందుకు వినియోగించే ఆక్వియ్ ఫిల్మ్ ఫార్మింగ్ ఫోమ్ తయారీలో పీఎఫ్ఏ రసాయనాలను వాడతారు. ఇప్పటికే అమెరికాకు చెందిన పర్యావరణ పరిరక్షణ సంస్థ నీటి కాలుష్యంపై దృష్టి సారించింది. తాగునీటిలో పీఎఫ్ఏ రసాయనాల స్థాయులను నిర్దేశిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆరాన్ అడ్కిన్స్ కేసుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక కొన్నేళ్లపాటు పీఎఫ్ఏ రసాయనాలతో కలుషితమైన నీటిని తాగి ఆరాన్ క్యాన్సర్ బారినపడ్డట్టు ఫిబ్రవరిలో తేలింది.  

మరోవైపు, ఆరాన్ భార్య కూడా కోర్టును ఆశ్రయించింది. తన భర్త క్యాన్సర్ కారణంగా తాను నరకం అనుభవించానని చెప్పుకొచ్చింది. భాగస్వామి సాంగత్యానికి దూరమయ్యానని పేర్కొంది. ఇది చివరకు తన వివాహ బంధంపై ప్రతికూల ప్రభావం చూపించిందని చెప్పుకొచ్చింది. నీటి కాలుష్యానికి బాధ్యులైన కంపెనీలు తమకు పరిహారం చెల్లించాలని తమ కేసులో వీరు కోరారు. నీటిలోని ఫ్లోరోరసాయన ఉత్పత్తుల కారణంగా జరిగే నష్టాల గురించి బాధ్యులైన కంపెనీలు తమను హెచ్చరించలేదని పేర్కొన్నారు. 

అగ్నిమాపక రసాయనాలతో పాటు నాన్‌స్టిక్ కుక్ వేర్ వంటి ఇతర రసాయనాల్లోనూ పీఎఫ్ఏఎస్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కెమికల్స్‌ చాలా ఏళ్ల పాటు అలాగే ఉండిపోతాయని, అధిక మోతాదుల్లో వీటి బారిన పడేవారికి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
PFAS
Testicular Cancer
USA

More Telugu News