Airport loaders Jobs: నెలకు రూ.22,000 జీతం.. 2,216 'ఎయిర్‌పోర్టు లోడర్' ఖాళీలు.. ముంబైకి పోటెత్తిన 25,000 మంది అభ్యర్థులు!

A recruitment drive for airport loaders led to a stampede like situation in Mumbai

  • ఎయిర్‌పోర్టు లోడర్ ఉద్యోగాల కోసం పోటెత్తిన ఆశావహులు
  • రద్దీని నియంత్రించడానికి ఇబ్బందిపడ్డ ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌ సిబ్బంది
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

దేశంలో నిరుద్యోగ పరిస్థితులకు అద్దం పట్టే ఘటన ఒకటి ముంబై మహానగరంలో మంగళవారం వెలుగుచూసింది. ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న 2,216 ఎయిర్‌పోర్ట్ లోడర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా.. ఏకంగా 25,000 మందికి పైగా ఆశావహులు పోటెత్తారు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఏర్పాటు చేసిన కార్యాలయానికి దరఖాస్తులు అందించేందుకు నిరుద్యోగులు ఎగబడ్డారు. అప్లికేషన్లు అందించేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అక్కడి పరిస్థితి తొక్కిసలాట వాతావరణాన్ని తలపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భారీ రద్దీని నియంత్రించేందుకు ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దరఖాస్తులు సమర్పించే కౌంటర్‌లకు చేరుకునేందుకు ఆశావహులు ఒకరినొకరు నెట్టుకోవడం కనిపించింది. అంతేకాదు, అభ్యర్థులు కనీసం ఆహారం, తాగునీరు లేకుండా గంటల తరబడి వేచిచూశారు. ఇక చాలా మంది అస్వస్థతకు గురైనట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఎయిర్‌పోర్ట్ లోడర్ల పని ఇదే..
కాగా ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందిస్తోంది. ఎయిర్‌పోర్ట్ లోడర్‌లు విమానంలో లగేజీని లోడ్ చేయడంతో పాటు అన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు బ్యాగేజ్ బెల్ట్‌లు, ర్యాంప్ ట్రాక్టర్‌లను కూడా ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఒక విమానంలో లగేజీ, కార్గో, ఆహార సరఫరాల లోడింగ్‌కు కనీసం ఐదుగురు లోడర్లు అవసరం అవుతారు. ఇక వీరి జీతం నెలకు సుమారు రూ.22,000 వరకు ఉంటుంది. అయితే చాలా మంది ఓవర్‌టైమ్ కూడా చేసి నెలకు రూ.30,000లకు పైగా సంపాదిస్తుంటారు. ఈ ఉద్యోగానికి చదువు ప్రాథమిక అర్హత ఉంటే సరిపోతుంది. కానీ, అభ్యర్థి శారీరకంగా బలంగా ఉండడం ఎంపికలో ముఖ్యం అవుతుంది.

ఎయిర్‌పోర్ట్ లోడర్ ఖాళీల గురించి తెలిసి ప్రథమేశ్వర్ అనే ఓ వ్యక్తి ఇంటర్వ్యూ కోసం ఏకంగా 400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ముంబై చేరుకున్నాడు. బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నానని చెప్పాడు. ఈ జాబ్ వస్తే చదువు మానేస్తావా అని ప్రశ్నించగా.. ‘‘ఏం చేస్తాం. అంత నిరుద్యోగం ఉంది మరి. ప్రభుత్వం మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతున్నాను’’ అని ప్రథమేశ్వర్ చెప్పాడు. కాగా ఇటీవల గుజరాత్‌లోతీ భరూచ్ జిల్లా అంక్లేశ్వర్‌లో ఓ కెమికల్ కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ జరగగా కేవలం 10 ఉద్యోగాల కోసం 1,800 మంది అభ్యర్థులు తరలివచ్చిన విషయం తెలిసిందే.

Airport loaders Jobs
Mumbai
Jobs
recruitment drive
Air India Airport Services Limited
  • Loading...

More Telugu News