Supreme Court: సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిల నియామకం

President Droupadi Murmu cleared the appointments of Justice N Kotiswar Singh and Justice R Mahadevan

  • జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహదేవన్‌‌ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర
  • ప్రకటించిన కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
  • మణిపూర్ నుంచి సుప్రీంకోర్ట్ జడ్జిగా పదోన్నతి పొందిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన జస్టిస్ కోటీశ్వర్ సింగ్

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జిలుగా జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహదేవన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు కొత్త న్యాయమూర్తులను నియమించామని, సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన అనంతరం నియమించామని పేర్కొన్నారు.

కాగా వీరిద్దరికీ పదోన్నత కల్పిస్తూ ఇదివరకే సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్తగా చేరిన ఇద్దరు జడ్జిలతో కలుపుకొని సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సహా మొత్తం జడ్జిల సంఖ్య 34కు చేరింది. 

మణిపూర్ నుంచి తొలి సుప్రీం జడ్జి
ప్రస్తుతం జమ్మూ కశ్మీర్, లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మణిపూర్ మొదటి అడ్వకేట్ జనరల్ ఎన్ ఇబోటోంబి సింగ్ కుమారుడే జస్టిస్ కోటీశ్వర్ సింగ్. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని కిరోరి మాల్ కాలేజ్ అండ్ క్యాంపస్ లా సెంటర్‌లో న్యాయశాస్త్రం చదివారు. 1986లో న్యాయవాదిగా కెరియర్ మొదలుపెట్టారు. జడ్జిగా పదోన్నత పొందడానికి ముందు మణిపూర్ అడ్వకేట్ జనరల్‌గా కూడా విధులు నిర్వర్తించారు. గౌహతి హైకోర్టు, మణిపూర్ హైకోర్టులలో పనిచేశారు.

9 వేలకుపైగా కేసులు వాదించిన జస్టిస్ మహదేవన్
ఇక జస్టిస్ మహదేవన్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. చెన్నైలో జన్మించిన ఆయన మద్రాసు లా కాలేజీలో చదువుకున్నారు. న్యాయవాదిగా 9,000లకు పైగా కేసులు వాదించారు. తమిళనాడు ప్రభుత్వానికి అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్‌గా(పన్నులు), మద్రాసు హైకోర్టులో భారత ప్రభుత్వానికి అడిషనల్ సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సెల్‌గా, సీనియర్ ప్యానెల్ న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2013లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది.

Supreme Court
ustice N Kotiswar Singh
Justice R Mahadevan
Droupadi Murmu
  • Loading...

More Telugu News