Rainy Season Health: వర్షాకాలం రోగాలతో కాస్త జాగ్రత్త.. ఈ ఆహార శుభ్రత చిట్కాలు పాటిస్తే ఎంతో మేలు!

Ensuring food safety during the rainy season is crucial to prevent illnesses
  • జాగ్రత్తగా లేకుంటే వర్షాకాలంలో పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం
  • కూరగాయల నుంచి వంటగది వరకు అన్నీ శుభ్రంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు
  • తాగునీరు, ఆహార నిల్వపై శ్రద్ధ పెట్టాలని సూచనలు
వర్షాకాలంలో వాతావరణం చల్లగా, హాయిగా అనిపిస్తుంటుంది. అనువైన వాతావరణంతో శరీరం చల్లబడి తాజా తాజాగా అనిపిస్తుంటుంది. కానీ ఇలాంటి పరిస్థితులే అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా ఆహారం, నీటి ద్వారా వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ఫుడ్ పాయిజనింగ్, కలరా, టైఫాయిడ్, డయేరియా వంటి వానాకాలం సంబంధిత రోగాలు వస్తుంటాయి. అందుకే ఈ సీజన్‌లో ఆహార భద్రతను పాటించడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునే కొన్ని ముఖ్యమైన చిట్కాలు సూచిస్తున్నారు.

1. కూరగాయలను శుభ్రంగా కడగాలి
వర్షాకాలంలో సాధారణంగా కూరగాయలు, పండ్లపై తేమ ఉంటుంది. ఈ కారణంగా బ్యాక్టీరియా పెరుగుదల, పరాన్నజీవులకు సంతానోత్పత్తి కేంద్రాలుగా పండ్లు కూరగాయలు మారే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని శుభ్రంగా కడగాలి. వెజిటబుల్ బ్రష్‌ను ఉపయోగించి కూరగాయలు, పండ్లను రుద్ది రుద్ది కడగడం చాలా మంచిది. ఇక ఆకు కూరలను ఉప్పు నీటిలో లేదా వెనిగర్ ద్రావణంలో కొన్ని నిమిషాల పాటు నానబెట్టి శుభ్రం చేసుకోవడం శ్రేయస్కరం.

2. ఆహారాన్ని చక్కగా ఉడకనివ్వాలి
వానాకాలంలో ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద వండడం చాలా ముఖ్యం. తద్వారా హానికరమైన బ్యాక్టీరియా, వ్యాధికారక క్రిములు నశించిపోతాయి. మాంసం, సముద్రపు ఆహార ఉత్పత్తులను కనీసం 75 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వండాలి. ఇందుకోసం ఫుడ్ థర్మామీటర్‌ని ఉపయోగించడం ఉత్తమం. అలాగే సరిగ్గా ఉడకని గుడ్లను తినడం ప్రమాదకరం. ఇక మిగిలిపోయిన ఆహార పదార్థాలను తినకపోవడం మంచిది. ఒకవేళ తినాలనుకుంటే కచ్చితంగా వేడి చేసిన తర్వాత మాత్రమే తినాలి.

3. శుభ్రమైన నీటినే తాగాలి
వర్షాకాలంలో కలుషిత నీటికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే కలుషిత నీటిని తాగితే మన శరీరం వ్యాధులకు నిలయం అవుతుంది. అందుకే సురక్షితమైన నీటిని మాత్రమే తాగుతున్నారా లేదా అనేది నిర్ధారించుకోవాలి. వేడి చేసి చల్లార్చిన, ఫిల్టర్ చేసిన, బాటిల్ వాటర్ మాత్రమే తాగాలి. నమ్మకం లేని వీధి వ్యాపారాల వద్ద నీటిని తాగకపోవడం చాలా చాలా మంచిది. ఇంటి దగ్గరే మంచి నీరు అని నిర్ధారించుకున్నాకే తాగడం బెటర్.

4. ఆహారం నిల్వ విషయంలో జాగ్రత్త
వానాకాలంలో ఆహారం కలుషితం కాకుండా నివారించాలంటే సరైన రీతిలో నిల్వ చేయడం అనివార్యం. 
పాల ఉత్పత్తులు, మాంసాహారాలు వంటి త్వరగా పాడైపోయే ఆహారాలను 4 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచుకోవడం ఉత్తమం. ఆహారాన్ని నిల్వచేసుకునే చోట తేమ ఉండకుండా చూసుకోవాలి. అంతేకాదు ఆహారంలోకి గాలి వెళ్లే అవకాశం లేని పాత్రలను ఎంచుకోవాలి. ముడి, వండిన ఆహార పదార్థాలను వేరు చేసుకోవడం ఇంకా ముఖ్యం.

5. కిచెన్ ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది
సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధించడంలో వంటగది పరిశుభ్రత చాలా ముఖ్యమైంది. కిచెన్‌లో అపరిశుభ్రతకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. వంట పాత్రలు, కూరగాయలు కట్ చేసే బోర్డులు అన్నింటినీ వేడి నీరు, సబ్బు లేదా క్రిమిసంహారక ద్రావణాలతో శుభ్రం చేసుకోవాలి. ఇక ఆహారం తినడానికి, వంట పాత్రలను ముట్టుకోవడానికి ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి.
Rainy Season Health
Health
Health News
Rainy season

More Telugu News