Team India: లాహోర్ లో భారత్–పాక్ మ్యాచ్ లకు బీసీసీఐ నో!

BCCI Says No To India vs Pakistan In Lahore Suggests This Venue
  • వచ్చే ఏడాది జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనున్న దాయాది దేశం
  • టీమిండియా మ్యాచ్ లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని కోరతామన్న బీసీసీఐ వర్గాలు
  • ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాల వల్ల 2008 నుంచి పాక్ లో పర్యటించని భారత్
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ–2025 కోసం టీమిండియా దాయాది దేశంలో కాలుపెట్టదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ టోర్నీలో భారత జట్టు మ్యాచ్ లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని కోరనున్నట్లు తెలిపాయి. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య పాక్ లో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.

ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాల కారణంగా 2008లో జరిగిన ఆసియా కప్ తర్వాత పాక్ లో భారత జట్టు పర్యటించలేదు. అలాగే భారత్ లో 2012 డిసెంబర్ నుంచి 2013 జనవరి మధ్య జరిగిన భారత్–పాక్ ద్వైపాక్షిక సిరీసే చివరిది. నాటి నుంచి ఇరు దేశాలు కేవలం ఐసీసీ టోర్నమెంట్లు, ఆసియా కప్ లో మాత్రమే తలపడుతున్నాయి.

భారత్–పాక్ మధ్య ఇంకా సంబంధాలు పునరుద్ధరణ కాకపోవడంతో చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఒకే నగరంలో అన్ని మ్యాచ్ లను ఆడాలని భారత్ కు పాక్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించింది. భారత్ అన్ని మ్యాచ్ లు ఆడేందుకు లాహోర్ ను వేదికగా ఎంపిక చేసినట్లు ఈఎస్ పీఎన్ క్రిక్ ఇన్ఫో వెబ్ సైట్ తెలిపింది. అయితే పాక్ లో పర్యటించేందుకు భారత జట్టు సుముఖంగా లేదు. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలు ఏఎన్ఐ వార్తాసంస్థకు తెలిపాయి.

కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఈ టోర్నమెంట్ కోసం టీమిండియాను పాకిస్థాన్ కు పంపుతామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మే నెలలో చెప్పారు. ‘చాంపియన్స్ ట్రోఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటాం’ అని ఆయన ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ అన్నారు.

గతేడాది ఆసియా కప్ లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వాస్తవానికి ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ బీసీసీఐ ఒత్తిడి కారణంగా పాక్ హైబ్రీడ్ విధానాన్ని అనుసరించింది. భారత్–పాక్ మ్యాచ్ లను తటస్థ వేదిక అయిన శ్రీలంకలో నిర్వహించింది. 2017లో చివరిసారిగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ గెలుచుకుంది.
Team India
Pakistan
Champtions Trophy 2025
Host nation
Srilanka
Dubai
BCCI
ICC
Lahore

More Telugu News