Buffallo: పోలీసులు తీర్చలేని పంచాయితీని చిటికెలో పరిష్కరించిన గేదె!

How A Buffalo Solved A Problem That A Village Panchayat Couldnt In UP

  • యూపీలోని ప్రతాప్ గఢ్ జిల్లాలో అనూహ్య ఘటన
  • ఇంటి నుంచి మేతకు వెళ్లి దారితప్పిన బర్రె
  • దాన్ని పట్టుకొని ఇంటికి తీసుకెళ్లిన వేరే ఊళ్లోని వ్యక్తి
  • మూడు రోజులు వెతికి చివరకు తన గేదెను గుర్తించిన యజమాని
  • ఇచ్చేందుకు అవతలి వ్యక్తి నిరాకరణ.. పోలీసుస్టేషన్ కు చేరిన పంచాయితీ

ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాలో పోలీసుల సమక్షంలో తెగని పంచాయితీని ఓ గేదె చిటికెలో పరిష్కరించింది! దీంతో గేదె వల్ల తలెత్తిన వివాదం చివరకు గేదె ద్వారానే సద్దుమణిగింది.

ఏం జరిగిందంటే.. జిల్లాలోని రాయ్ అస్కరాన్ పూర్ గ్రామానికి చెందిన నంద్ లాల్ సరోజ్ కు చెందిన ఓ గేదె మూడు రోజుల కిందట దారితప్పింది. మేత కోసం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోకుండా కొంత దూరంలో ఉన్న పురే హరికేష్ అనే గ్రామంలో సంచరించింది. దీన్ని గమనించిన హనుమాన్ సరోజ్ అనే గ్రామస్తుడు దాన్ని పట్టుకొని ఇంట్లో కట్టేసుకున్నాడు.

అయితే మూడు రోజులపాటు గేదె జాడ కోసం గాలించిన నంద్ లాల్.. ఎట్టకేలకు తన గేదె హనుమాన్ సరోజ్ వద్ద ఉందని గుర్తించాడు. గేదెను తిరిగి ఇవ్వాలని కోరగా అతను నిరాకరించాడు. అది తన గేదేనని బుకాయించాడు. 

దీంతో నంద్ లాల్ సమీపంలోని మహేష్ గంజ్ పోలీసు స్టేషన్ ను ఆశ్రయించాడు. గేదెతోపాటు హనుమాన్ సరోజ్ ను స్టేషన్ కు పిలిపించగా అక్కడ కూడా ఆ గేదె తనదేనంటూ చెప్పుకొచ్చాడు. కొన్ని గంటలపాటు ఈ తతంగం నడిచినా పంచాయితీ తెగలేదు.

చివరకు పోలీసులు గేదెను రోడ్డు మీద వదిలేయాలని సూచించారు. ఎవరి ఇంటికి గేదె వెళ్తే వారే దాని అసలైన యజమానిగా ప్రకటిస్తామన్నారు. ఇందుకు నంద్ లాల్, హనుమాన్ తోపాటు గ్రామస్తులు కూడా అంగీకరించారు. దీంతో వాళ్లిద్దరినీ పోలీసులు వారి గ్రామాలకు వెళ్లే మార్గాలకు వ్యతిరేక దిశలో నిలబడాల్సిందిగా సూచించారు.

అనంతరం గేదెను స్టేషన్ నుంచి విడిచిపెట్టగా అది నేరుగా రాయ్ అస్కరాన్ పూర్ గ్రామం వైపు నంద్ లాల్ ను అనుసరిస్తూ వెళ్లింది. దీంతో గేదెను నంద్ లాల్ కు పోలీసులు అప్పగించారు. గేదె తనదంటూ బుకాయించిన హనుమాన్ సరోజ్ ను పోలీసులతోపాటు గ్రామస్తులు మందలించారు.

Buffallo
Uttar Pradesh
Pratapgarh
Police Station
Settlement
Owner
Missing
Complaint
  • Loading...

More Telugu News