Arvind Kejriwal: సీబీఐ అరెస్టుపై కోర్టుకెక్కిన కేజ్రీవాల్

Arvind Kejriwal moves Delhi High Court challenging his arrest CBI remand

  • తనకు కింది కోర్టు రిమాండ్ విధించడాన్ని తప్పుబట్టిన ఢిల్లీ సీఎం
  • ఈ కేసులో ఆయన్ను ఈ నెల 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపిన కింది కోర్టు
  • ఇదే కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన ఈడీ
  • కింది కోర్టు బెయిల్ ఇవ్వగా దానిపై స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని, రిమాండ్ కు తరలించడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. అలాగే తనను మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ జూన్ 26న ట్రయల్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను కూడా ఆయన తప్పుబడుతూ కోర్టుకెక్కారు.

సీబీఐ తనను అరెస్టు చేయడం చట్టబద్ధమేనంటూ ఢిల్లీలోని ట్రయల్ కోర్టు జూన్ 26న ఆదేశాలు జారీ చేయడం.. తనను 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో జూన్ 29న ట్రయల్ కోర్టు కేజ్రీవాల్ ను జులై 12 దాకా అంటే మొత్తం 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది. 

కేజ్రీవాల్ ను కస్టడీకి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ట్రయల్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులోని ప్రధాన కుట్రదారుల్లో ఒకరిగా కేజ్రీవాల్ పేరు బయటకు వచ్చిందని గుర్తుచేసింది. అలాగే ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున ఆయన కస్టడీ అవసరమని పేర్కొంది. అంతకుముందు వాదనల సందర్భంగా సీబీఐ ట్రయల్ కోర్టుకు కేజ్రీవాల్ తమ దర్యాప్తుకు సహకరించడం లేదని తెలిపింది. తాము అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇవ్వడం లేదని తెలిపింది.

ఇప్పటికే ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయన్ను మార్చి 21న అరెస్టు చేసింది. ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం విధానంలో భారీగా డబ్బు చేతులు మారిందని.. ఇందులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఢిల్లీలోని ట్రయల్ కోర్టు ఇటీవల ఆయనకు బెయిల్ ఇవ్వగా ఢిల్లీ హైకోర్టు దానిపై స్టే విధించింది.

ఈ కేసులో 17 మందిని నిందితులుగా పేర్కొంటూ ఈడీ ఇప్పటికే నాలుగు చార్జిషీట్లు కోర్టులో దాఖలు చేసింది. కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఆప్ మీడియా ఇన్ చార్జి విజయ్ నాయర్ వివిధ మద్యం తయారీ సంస్థలు, మద్యం వ్యాపారులను ముడుపులు అడిగారని ఈడీ ఆరోపిస్తోంది. ముడుపులు ఇచ్చే సంస్థలు, వ్యాపారులకు అనుకూలంగా 2021–22 ఎక్సైజ్ పాలసీలో నిబంధనలు పొందుపరుస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. ఇందుకు అంగీకరించిన సౌత్ గ్రూప్ సహా కొన్ని సంస్థలతోపాటు కొందరు వ్యాపారుల నుంచి సుమారు రూ. 100 కోట్ల ముడుపులు తీసుకున్నారని తెలిపింది. ఆ సొమ్మును హవాలా మార్గం ద్వారా పార్టీ ఖాతాలోకి మళ్లించారని.. అందులో సుమారు రూ. 44 కోట్లను 2021‌‌–22 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేశారని వివరించింది.

ఎక్సైజ్ పాలసీపై రాజకీయ దుమారం రేగడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 2022 జూలైలో ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీని రద్దు చేసింది.

Arvind Kejriwal
Delhi Chief Minister
High Court
Moves
Challenges
Trial Court
Orders
  • Loading...

More Telugu News