Team India: టీమిండియాకు అభినందనలు తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి, మహేశ్ బాబు

Revanth Reddy and Tollywood stars haols Team India for historic world cup win
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ను సాధించిన టీమిండియాకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను టీమిండియా ఓడించిన తీరు అభినందనీయం అని పేర్కొన్నారు. వరల్డ్ కప్ ను గెలవడం ద్వారా టీమిండియా దేశవాసులను గర్వించేలా చేసిందని పేర్కొన్నారు. ఈ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ప్రపంచ క్రికెట్లో భారత్ కు ఎదురులేదని మరోసారి నిరూపించిందని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.  

భారత్ ఇప్పుడు ప్రపంచం అగ్రభాగాన...!: చిరంజీవి

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా విజేతగా నిలవడం పట్ల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. భారత్ ఇప్పుడు ప్రపంచం అగ్రభాగాన ఉందని మురిసిపోయారు. 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 వరల్డ్ కప్ ను గెలవడం అద్భుతం, అమోఘం అని కొనియాడారు. 

భలే ఆడావు విరాట్ కోహ్లీ... బుమ్రా, హార్దిక్, అక్షర్, అర్షదీప్... అన్నింటికి మించి సరైన సారథి రోహిత్ శర్మకు, తిరుగులేని ఆటతీరు కనబర్చిన యావత్ జట్టుకు శిరసు వంచి వందనం చేస్తున్నాను అని చిరంజీవి తెలిపారు. నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ పట్టిన సూర్యకుమార్ యాదవ్ అదరహో అనిపించాడు అంటూ ట్వీట్ చేశారు. 

ఈ కప్ మనది: మహేశ్ బాబు

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా విజయం పట్ల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. ఈ కప్ మనది అంటూ హర్షం వ్యక్తం చేశారు. బ్లూ జెర్సీలు ధరించిన మన హీరోలు ఇప్పుడు వరల్డ్ చాంపియన్లు అని కొనియాడారు. టీమిండియాకు శిరసు వంచి వందనం చేస్తున్నానని మహేశ్ బాబు తెలిపారు.

ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో టీమిండియా విన్యాసాలు మామూలుగా లేవని కితాబిచ్చారు. సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ చారిత్రక విజయం పట్ల అమితగర్వంతో పొంగిపోతున్నానని మహేశ్ బాబు తెలిపారు. జై హింద్ అంటూ తన ట్వీట్ ను ముగించారు.
Team India
T20 World Cup 2024
Winner
Revanth Reddy
Chiranjeevi
Mahesh Babu

More Telugu News